ఆగని గుట్కా దందా.. | Sakshi
Sakshi News home page

ఆగని గుట్కా దందా..

Published Thu, Jan 25 2018 6:10 PM

gutka and khaini business rising a huge in kagajnagar - Sakshi

సాక్షి,ఆసిపాబాద్‌:  కాగజ్‌నగర్‌ పట్టణం నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాకు అడ్డాగా  మారింది. నిత్యం ఇక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు రవాణా చేస్తూ కొంత మంది వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే గుట్కాలు, ఖైనీలు, పొగాకు ఉత్పత్తులను కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు నిషేధించినా కాగజ్‌నగర్‌లో మాత్రం ఆ నిబంధనలేవీ అమలవడం లేదు. ఇప్పటికే జిల్లాలో పొగాకు నమలడం ద్వారా అనేక మంది నోటి క్యాన్సర్‌ వ్యాధి బారిన పడి నరకం అనుభవిస్తుంటే మార్కెట్‌లో విచ్చలవిడిగా నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభ్యం అవుతుండం ఆందోళన కలిగిస్తోంది. పట్టణానికి చెందిన ముగ్గురు బడా వ్యాపారులు పథకం ప్రకారం కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ మీదుగా పెద్ద ఎత్తున అంబర్‌ ఖైనీ, గుట్కా, పాన్‌ మసాల వంటి నిషేధిత పొగాకు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలకు రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నారు.
 
పల్లెలకు రవాణా..
కాగజ్‌నగర్‌ నుంచి జిల్లాలోని అన్ని మారుమూల గ్రామాలకు అక్రమార్కులు రవాణా చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. నిషేధిత ఖైనీలపై రూ.3 ధర ఉండగా ఏకంగా రూ.10కి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటితోపాటు మాధవి ఖైని, పుల్‌చాప్, ఘన్‌శ్యాం పొగాకుతో పాటు ఎంసీ గుట్కాలను ట్రాన్స్‌పోర్టుల ద్వారా ఇక్కడికి దిగుమతి చేసుకుని పల్లె పల్లెకూ రవాణా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పాన్‌ టేలాలు, చిన్న షాపులకు సరఫరా చేయడమే కాకుండా సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, దహెగాం, పెంచికల్‌పేట, చింతలమానెపల్లి, మండలాల్లోని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తూ అమాయక ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. కొంత మంది నిరుద్యోగ యువకులను పావుగా వాడుకుంటూ వారికి కమిషన్‌ ఆశ చూపి వారి ద్వారా రైళ్లలో అంబర్, మాధవి ఖైనీ, పుల్‌చాప్, ఘన్‌శ్యాం, ఎంసీ గుట్కాలు రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నట్లు సమాచారం. సదరు వ్యాపారులు పెద్ద ఎత్తున నిషేధిత వ్యాపారం చేస్తున్నట్లు కొంత మంది అధికారులకు తెలిసినా వారిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిరు వ్యాపారులు, పాన్‌ టేలాల నిర్వాహకులపై అడపాదడపా చర్యలు తీసుకుంటున్న అధికారులు పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే బడా వ్యాపారుల జోలికి ఎందుకు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి.
 
నిత్యం దిగుమతి.. 
ప్రతీ రోజు వివిధ ట్రాన్స్‌పోర్టుల ద్వారా హైద్రాబాద్, నాగ్‌పూర్, బెంగళూరు, గుజరాత్‌ నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులు కాగజ్‌నగర్‌కు దిగుమతి అవుతున్నట్లు సమాచారం. అనేక సార్లు పోలీసులు ఆయా ట్రాన్స్‌పోర్టులపై దాడి చేశారు. పెద్ద ఎత్తున పొగాకు ఉత్పత్తులు బయటపడినా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఒక ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడు కేవలం ఈ రవాణాకే ప్రాధాన్యం ఇస్తూ భారీగా పోగాకు ఉత్పత్తులు తరలిస్తున్నాడని సమాచారం.
 
రూ. కోట్లలో దందా..
పోగాకు ఉత్పత్తుల చీకటి వ్యాపారం ద్వారా వ్యాపారులు కోట్ల రూపాయలు అర్జిస్తున్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్‌ నుంచి రూ.13,500 రూపాయలకు ఒక్కో అంబర్‌ ఖైరీ కార్టన్‌ (బాక్స్‌)లను దిగుమతి చేస్తున్న వ్యాపారులు దాన్ని స్థానిక మార్కెట్‌లో రూ.18,500 రూపాయలకు వరకు  విక్రయిస్తున్నారు. 100 ప్యాకెట్లు ఉన్న ఒక్క బాక్స్‌ విక్రయించి రూ. 5వేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా ప్రతీ రోజు 40 నుంచి 50 కార్టన్ల అంబర్‌ ఖైనీ జిల్లాలో మారుమూల గ్రామాలన్నింటికీ చేరుతోంది. రోజుకు సగటున 40 నుంచి 60 కార్టన్ల నిషేధిత పొగాకు ఉత్పత్తులను కరీంనగర్, మంచిర్యాల, వరంగల్, చంద్రాపూర్, ఆదిలాబాద్, రాజురా, వంటి నగరాలకు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. అయితే ప్రతీ రోజు 80 కార్టన్ల అంబర్‌ ఖైనీ విక్రయాలు జరిగినా బాక్సుకు ఐదు వేల చొప్పున అంటే సుమారుగా రూ.4 లక్షల రూపాయల వరకు దండుకుంటున్నారు. ఈ విక్రయాలను నెలసరి లెక్కిస్తే ఇక్కడ ఉన్న ముగ్గురు బడా వ్యాపారులు అర్జన కోట్లలోనే ఉంటోంది.
 
వేకువ జామునే రవాణా!

పలు ట్రాన్స్‌పోర్టుల ద్వారా హైద్రాబాద్, నాగ్‌పూర్‌ వంటి ప్రాంతాల నుంచి కాగజ్‌నగర్‌లో దిగుమతి చేసుకున్న పొగాకు ఉత్పత్తులను సదరు వ్యాపారులు రహస్య గోదాంలలో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి ఆర్డర్‌ను బట్టి పక్క జిల్లాలకు ప్రత్యేక వాహనాల్లో తెల్లవారు జామున సమయాల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు బులేరో, టాటా 207, అశోక్‌ లేలాండ్‌ దోస్త్, మినీ ఆటోలు తదితర వాహనాల్లో కింది భాగంలో పొగాకు ఉత్పత్తులను భద్రపర్చి పై భాగంలో అటకుల సంచులు, కుర్‌కురే సంచులు నింపి దర్జాగా రవాణా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఉదయం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండడం, అధికారుల తనిఖీలు లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. 

ఆరోగ్యానికి హానికరం
అంబర్‌ ఖైనీ, గుట్కాలు నమలడం ఆరోగ్యానికి హానికరం. ఎవరైనా దీర్ఘకాలంగా ఇవి వాడితే నోటి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముంది. నోటి క్యాన్సర్‌ బారినపడి ఆరోగ్యం దెబ్బతినక ముందే అంబర్, గుట్కా నమిలే అలవాట్లను వెంటనే మానుకోవాలి. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. 
– డాక్టర్‌ రమేశ్, సీనియర్‌ వైద్యులు, కాగజ్‌నగర్‌

వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
ఈ ప్రాంతంలో అంబర్‌ ఖైనీ, ఎంసీ గుట్కా వంటి నిషేధిత ఉత్పత్తులను దిగుమతి చేస్తూ వందలాది మంది చావుకు కారణమవుతున్న బడా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్యుల చితిపై రొట్టెలు కాల్చి తింటున్న వారిని గుర్తించి ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి. మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గుట్కాలు, ఖైనీలు నమిలే వారికి కౌన్సెలింగ్‌  ఇస్తాం. 
– గజ్జెల లక్ష్మణ్, స్వర్ణకమలం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, కాగజ్‌నగర్‌

Advertisement
Advertisement