ఇదేంది తమ్ముడూ? | Sakshi
Sakshi News home page

ఇదేంది తమ్ముడూ?

Published Sat, Jan 6 2018 10:33 AM

smuggling Sand mafia in kurnool district - Sakshi

కర్నూలు (వైఎస్‌ఆర్‌సర్కిల్‌): అధికార పార్టీ నేతలకు ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోంది. వంకలు..వాగులు తేడా లేకుండా ఇసుక కన్పిస్తే చాలు అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో.. అధికారుల అండదండలతో అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతున్నాయి. మొక్కు బడి దాడులతో.. నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టే అధికార యంత్రాంగం వీరికి పరోక్షంగా సహకరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ధనదాహానికి అలవాటు పడిన  తెలుగు తమ్ముళ్లు ఇసుక మాఫియాపై ఆధి పత్యం కోసం పరస్పరం దాడులకు తెగబడుతున్నారు. వెల్దుర్తి మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త, ఓ మాజీ ఎంపీపీ మధ్య తలెత్తిన విబేధాలు మాఫీయా గొడవలను తలపిస్తుండడం ఇందుకు నిదర్శనం. ఇదే తరహా ఘటనలు సమీప మండలాల్లోనూ చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

వంకలకూ వసూళ్లు..
వెల్దుర్తి, సమీప ప్రాంతాల్లో కొందరు నాయకులు గ్రామ శివారులోని వంకలను కూడా కొల్లగొడుతున్నారు. ఎవరైనా ఇసుక కావాల్సి వస్తే రూ.200 చెల్లిస్తేనే  ట్రాక్టర్‌ను అనుమతిస్తూ దందాకు తెరతీశారు. బయటి వ్యక్తులకు రూ.200 వసూలు చేస్తున్న వీరు.. తమ సొంత ట్రాక్టర్లతో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలిస్తూ కోట్లాది రూపాయలతో జేబులు నింపుకొంటున్నారు. అప్పనంగా వస్తున్న సంపాదన చూసి తమ్ముళ్లు తమదంటే తమదని తన్నుకుంటున్నారు. మాఫియాగా ఏర్పడి పెత్తనం కోసం పోటీ పడుతున్నారు. ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడడం, హత్యలు చేయించడం  పరిపాటిగా మారినా అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం.

రాత్రీ పగలు తరలింపు..
వెల్దుర్తి, డోన్, క్రిష్ణగిరి, కోడుమూరు, వర్కూరు తదితర ప్రాంతాల సమీప వంకల నుంచి వెయ్యి ట్రాక్టర్లకుపైగా ఇసుక తరలింపులో నిమగ్నమయ్యాయి. వంకల నుంచి సేకరించిన ఇసుకను మండల కేంద్రాలు, గ్రామ శివార్లలో డంప్‌ చేసి అనుకూల సమయంలో ట్రిప్పు రూ.2,500 నుంచి రూ.3,500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగంలో ఇసుకాసురుల ఆదాయం నెలకు రూ. 15 కోట్లకుపైగా ఉంటున్నట్లు సమాచారం. విషయం తెలిసినా అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించి పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.   

ఎత్తుకు పైఎత్తులు....: ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దాడులు చేసినా ఇసుక మాఫియా బెదరడంలేదు.  గత ఏడాది డిసెంబర్‌లో వెల్దుర్తి సమీపంలోని ఎల్లమ్మగుడి రస్తా వద్ద ఓ మాజీ ఎంపీపీ వర్గానికి చెందిన 10 ట్రాక్టర్ల ఇసుక డంప్‌ను తహసీల్దార్‌ రామాంజనేయులునాయక్, ఎస్‌ఐ ఖాజావలీ సీజ్‌చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆవతలి వర్గం నాయకులు మరుసటి రోజే నార్లాపురం–బొమ్మిరెడ్డి పల్లె గ్రామాల వద్ద ప్రత్యర్థి ఎంపీపీకి చెందిన 100 ట్రాక్టర్ల ఇసుక డంప్‌పై సమాచారం అందించి అధికారులతో సీజ్‌ చేయించారు.  

వాగులు, వంకలు మటుమాయం.. వెల్దుర్తి, కోడుమూరు, సి. బెళగల్‌ తదితర మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలే లక్ష్యంగా తెలుగు తమ్ముళ్లు బరిలోకి దిగుతున్నారు. నదీగర్భాలు, వంకల్లో లోతట్టు నేల కన్పించేలా ఇసుక తోడేస్తున్నారు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె–నార్లాపురం మధ్య వంకలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలుండటం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు          5 నెలల పాటు తవ్వి అక్రమంగా తరలించేశారు. 

Advertisement
Advertisement