‘ఉమ్మడి’గానే.. | Sakshi
Sakshi News home page

‘ఉమ్మడి’గానే..

Published Sun, May 27 2018 12:06 PM

No DCC presidents in Telangana - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాల పునర్విభజనతో సుమారు ఏడాదిన్నర క్రితం ఉమ్మడి మెదక్‌ జిల్లా మూడు కొత్త జిల్లాలుగా విడిపోయింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు ఏర్పాటైనా ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేటికీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే పార్టీ రాజకీయాలు నడుపుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, కార్యవర్గంపై టీఆర్‌ఎస్‌ కసరత్తు పూర్తి చేసినా, చివరి నిమిషంలో ఆలోచన విరమించుకుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా నర్సాపూర్‌కు చెందిన మురళీ యాదవ్‌ వ్యవహరిస్తున్నారు.

 టీఆర్‌ఎస్‌ తరహాలోనే కాంగ్రెస్‌ కూడా కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులు, కార్యవర్గాలను ప్రకటిస్తుందనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. కొత్త జిల్లాలకు కార్యవర్గాన్ని ప్రకటించడంపై టీపీసీసీ ఒకటి రెండు దఫాలు జిల్లా కాంగ్రెస్‌ నేతల నుంచి అభిప్రాయ సేకరణ కూడా  జరిపింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ కొత్త జిల్లాలకు కార్యవర్గ ఏర్పాటుపై జరిపిన అభిప్రాయ సేకరణలో మిశ్రమ స్పందన వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన డీసీసీ అధ్యక్షులను ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా మరోమారు కొనసాగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఓటమి తర్వాత సునీతదే భారం
2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో కేవలం జహీరాబాద్, నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపుతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2014 ఆగస్టులో జరిగిన మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి సునీతా రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చివరి నిమిషంలో బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్ర పునర్విభజ , సాధారణ ఎన్నికల్లో ఓటమి తదితర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి 2014 అక్టోబర్‌లో డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 

అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్‌ మినహా మిగతా చోట్ల పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో కేడర్‌ లేని పరిస్థితి. కొన్ని చోట్ల బలహీన బహుళ నాయకత్వం ఉండడంతో నేతల నడుమ విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మూడున్నరేళ్లుగా సునీతా లక్ష్మారెడ్డి  పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ వస్తున్నారు. గ్రూపు తగాదాలు, విభేదాలకు దూరంగా ఉండడం, వివాదాలకు అతీతంగా ఉండడంతో సునీత నాయకత్వంపై పెద్దగా ఫిర్యాదులు కూడా లేవు. తన అసెంబ్లీ నియోజకవకర్గం నర్సాపూర్‌కే పరిమితమవుతూ.. జిల్లా కేంద్రం సంగారెడ్డితో పాటు ఇతర చోట్ల స్థానిక నేతల ఆహ్వానిస్తేనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఎన్నికల ఏడాదిలో పగ్గాలు
త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది ఆరంభంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో సునీతా లక్ష్మారెడ్డిని మరోమారు డీసీసీ అధ్యక్షురాలిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, ముత్యంరెడ్డి మినహా సునీత కంటే సీనియర్‌ నేతలెవరూ లేరు. మెదక్, పటాన్‌చెరు, దుబ్బాక, సిద్దిపేట, నారాయణఖేడ్‌లో బహుళ నాయకత్వం ఉన్నా, నేతలందరూ నియోజకవర్గానికే పరిమితం అవుతూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో కలుపుగోలు వ్యక్తిగా పేరున్న సునీత లక్ష్మారెడ్డికి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయవచ్చనే ఆలోచనతో అధిష్టానం మరోమారు డీసీసీ పీఠాన్ని అప్పగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలో అప్పగించిన బాధ్యతను సునీత లక్ష్మారెడ్డి ఎంత మేర నెరవేరుస్తారనే అంశంపై అటు కాంగ్రెస్‌లో, ఇటు బయటా ఆసక్తి నెలకొంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement