జుట్టు రంగుకి అరకోటి..? | Sakshi
Sakshi News home page

జుట్టు రంగుకి అరకోటి..?

Published Sun, Jan 31 2016 12:13 AM

జుట్టు రంగుకి అరకోటి..?

సినిమాల్లో రంగు రంగుల కాస్ట్యూమ్స్‌లో, రకరకాల కేశాలంకరణలతో కనిపించే కథానాయికలను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. తెరపై వాళ్లు ఇలా తళుకులీనుతూ కనిపించడం కోసం బాగానే ఖర్చుపెడతారు. ఒక్కోసారి ఆ ఖర్చు గురించి వింటే సామాన్యులు షాకైపోతారు. ప్రస్తుతం ‘ఫితూర్’ చిత్రానికి కథానాయిక కత్రినా కైఫ్ కేశాలంకరణ కోసం అయిన ఖర్చు గురించి బాలీవుడ్‌లో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి.

 ఈ చిత్రంలో కత్రినా ఎరుపు రంగు జుట్టుతో కనిపిస్తారు. జుట్టు రంగు అలా మార్చడానికి ముందుగా ముంబయ్‌లో ఉన్న హెయిర్ స్టైలిస్ట్‌ని సంప్రతించారట. కత్రిన జుట్టుకి అతను వేసిన రంగు పెద్దగా నప్పలేదట. అందుకని ఆమె లండన్‌లో తనకు తెలిసిన స్టైలిస్ట్‌తో మాట్లాడారని సమాచారం. చిత్రీకరణ వరుసగా జరిగితే ఫరవాలేదు.. రంగు అలానే ఉంటుంది. మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కత్రిన రంగు మార్చేసుకునేవారట. మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టినప్పుడు లండన్ వెళ్లి రంగు వేయించుకుని వచ్చేవారట.

 ఫ్లయిట్‌లో ఫస్ట్ క్లాస్ టికెట్, లండన్‌లో ఐదు నక్షత్రాల హోటల్‌లో బస, ఆ స్టైలిస్ట్ పారితోషికం - అన్నీ కలిపి, ఈ చిత్రం పూర్తయ్యేసరికి కేవలం రంగు కోసమే 55 లక్షల రూపాయలు ఖర్చయ్యిందట. ఇది విన్నవాళ్లు చిత్ర నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, దర్శకత్వం వహించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యహరించిన అభిషేక్ కపూర్‌ని అభినందించకుండా ఉండ లేకపోతున్నారు. వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
Advertisement