90 ఎంఎల్‌ : మూవీ రివ్యూ

6 Dec, 2019 16:14 IST|Sakshi
Rating:  

టైటిల్‌: 90ఎంల్‌
నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్‌, రోల్‌రైడా, కాలకేయ ప్రభాకర్‌, రావూ రమేష్‌,అలీ, పోసాని కృష్ణమురళి, సత్యరాజ్‌
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
దర్శకుడు: ఎర్ర శేఖర్‌రెడ్డి
నిర్మాణ సంస్థ: కార్తికేయ క్రియేటివ్‌ వర్క్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకెచ్చిన యువకెరటం కార్తికేయ. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్‌ కావడంతో కార్తికేయకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హిప్పీ, గుణ 369 వంటి సినిమాలు చేసిన ఈ యంగ్‌ హీరో సరైన సక్సెస్‌ను అందుకోలేదు. ఈ క్రమంలో ‘90ఎంఎల్‌’ అంటూ డిఫరెంట్‌ టైటిల్‌తో తెరమీదకు వచ్చాడు కార్తీకేయ. రోజుకు మూడుపూటల మందు వేస్తే తప్ప మనుగడ సాగించని ఓ యువకుడి కథ అంటూ ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకులపైకి వదిలారు. ఇంతకు ఈ మందుబాబు కథేంటో తెలుసుకుందాం పదండి..

కథ:
పార్వతీనగర్‌కు చెందిన దేవదాస్‌ (కార్తికేయ).. ఓ అరుదైన వ్యాధి వల్ల రోజూ మూడుపూటలు 90 ఎంఎల్‌ లిక్కర్‌ తాగాల్సిన విచిత్రమైన స్థితి అతనిది. ఈ వ్యాధి వల్ల కన్న తల్లిదండ్రులే మద్యం తాగమని అతన్ని బతిలాడుతుంటారు. అలాంటి దేవ్‌దాస్‌ సాహసాన్ని సోషల్‌ మీడియా ద్వారా చూసిన సువాసన (నేహా సోలంకి)   అతన్ని ఇష్టపడుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. సువాహన కుటుంబానికి మద్యం అంటేనే పరమ అసహ్యం. ఆమె తండ్రి ట్రాఫిక్‌ పోలీసు. మరోవైపు జాన్విక్‌ (రవికిషన్‌) కూడా మద్యం వ్యసనపరుడే. మద్యం తాగి ఓసారి జాన్విక్‌ ఇంటికి వెళ్లిన దేవ్‌దాస్‌ కొన్ని కారణాల వల్ల అతన్ని చితకబాదుతాడు. ఈ క్రమంలో సువాహనకు దేవ్‌దాస్‌ మద్యం తాగే విషయం తెలిసి అతనితో బ్రేకప్‌ చేసుకుంటుంది. అతను ఎందుకు మద్యం తాగుతున్నాడో సువాహనకు తెలుసుకోదు. ఇంకోవైపు మద్యంలో మత్తులో ఉన్నప్పుడు తనను ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? తెలుసుకునేందుకు జాన్విక్‌ ప్రయత్నిస్తుంటాడు. అసలు జాన్విక్‌-దేవ్‌దాస్‌కు మధ్య ఏం జరిగింది? ఒక్క పూట 90 ఎంఎల్‌ తాగకుంటే చచ్చిపోయే స్థితిలోని దేవదాస్‌ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు. ఈ క్రమంలో జాన్విక్‌, అతని గ్యాంగ్‌ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ.

విశ్లేషణ:
కొత్త దర్శకుడు యెర్ర శేఖర్‌రెడ్డి ఒకింత భిన్నమైన కథతో కమర్షియల్‌ హంగులతో మాస్‌, యూత్‌ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ మాస్‌మసాలా కథను సిద్ధంచేసినట్టు కనిపిస్తోంది. సినిమాటిక్‌గా, కామెడీపరంగా సినిమా బావుంది. కామెడీ సీన్లు నవ్వించేలా ఉన్నాయి. హీరోహీరోయిన్లు కార్తికేయ, సోలంకీ చాలా ఎనర్జీటిక్‌గా యాక్ట్‌ చేశారు. సినిమాటోగ్రఫి, నేపథ్య సంగీతం, పాటలు బావున్నాయి. రవికిషన్‌, కాలకేయ ప్రభాకర్‌, రావూ రమేశ్‌, సత్యరాజ్‌, పోసాని కృష్ణమురళి, రోల్‌రైడా తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.  నిర్మాణ విలువులు చిత్రస్థాయికి తగ్గట్టు ఉన్నాయి. కానీ, బలమైన కథ, కథనాలు సినిమాలో లేకపోవడం, ఎక్కువగా సినిమాటిక్‌గా, సెకండాఫ్‌ కొంత బోర్‌ కొట్టించడం మైనస్‌ పాయింట్‌గా అనిపిస్తుంది.

ఈ సినిమా మూలకథనే మద్యం మీద ఆధారపడి ఉంది. ఒకప్పుడు దేవదాసు సినిమాలో ప్రేమలో విఫలమై గుండెల్ని పిండేసే బాధను దిగమింగలేక మద్యానికి బానిసై.. జగమే మాయా, బతుకే మాయ అని పాడుకుంటే ప్రేక్షకులు కూడా ఆ పాత్రలో లీనమై దుఃఖించారు. కథపరంగా చూసుకుంటే ఈ సినిమాలోని హీరోది పెద్ద సమస్యే. ఒక్క పూట మద్యం తాగకపోయినా చచ్చిపోయే పరిస్థితి ఉండటం హీరో పట్ల సానుభూతి కల్పించేదే. కానీ, సినిమాలో కమర్షియల్‌ పంథాలో మాస్‌ అంశాలను దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించడాన్ని కొంత గ్లోరిఫై చేసినట్టు కనిపిస్తుంది. సమాజం మీద ఎంతో విషప్రభావం చూపుతున్న మద్యం నేపథ్యంగా సినిమాను తీసినప్పుడు దర్శకుడు కమర్షియల్‌, మాస్‌ అంశాలే కాకుండా ఇంకాస్త సెన్సిబుల్‌గా ఆలోచించి.. సమాజానికి ఏదైనా చెబితే బాగుండేనేమోనని ప్రేక్షకులకు అనిపించవచ్చు. ఎందుకంటే సినిమా వినోద సాధనమే కాదు బలమైన మాద్యమం కూడా. సినిమా తెర నిండా ‘పొగ త్రాగుట, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అన్న ట్యాగ్‌ తప్ప.. మద్యం వల్ల జరిగే ఏ చెడు గురించి సినిమా పెద్దగా ఫోకస్‌ చేసినట్టు కనిపించదు. సినిమాలో ‘రేప్‌’ మీద జోక్‌ వినిపించడం ఇన్‌సెన్సిటివ్‌గా అనిపిస్తుంది.

బలాలు
హీరోహీరోయిన్ల నటన
కామెడీ
చిత్ర నిర్మాణ విలువలు

బలహీనతలు
బలమైన కథ, కథనాలు లేకపోవడం
మరీ సినిమాటిక్‌గా ఉండటం

- శ్రీకాంత్‌ కాంటేకర్‌

Rating:  
(2.5/5)
Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు