తెలుగు సినిమా అంటే పిచ్చి! | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమా అంటే పిచ్చి!

Published Thu, Mar 2 2017 11:30 PM

తెలుగు సినిమా అంటే పిచ్చి!

‘‘నేను చిన్ననాటి  నుంచి తెలుగు సినిమాలను చూస్తూ పెరిగాను. అందుకే సినిమా మీద ప్రేమతో ఐర్లాండ్‌లో డిప్లొమా ఇన్‌ స్క్రీన్‌ప్లే, లండన్‌లో డిప్లొమా ఇన్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ పూర్తి చేశాను. ‘ఆకతాయి’ సినిమాలో కొత్త ప్రయోగాలు చేశాను’’ అని రామ్‌ భీమన అన్నారు. ఆశిష్‌రాజ్, రుక్సార్‌ మీర్‌ జంటగా విజయ్‌ కరణ్, కౌశల్‌ కరణ్, అనిల్‌ కరణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌ భీమన చెప్పిన విశేషాలు...

► పాయింట్‌ ఆఫ్‌ వ్యూ అనే టెక్నాలజీని మొదటిసారి ఈ సినిమాలో ప్రయోగించాను. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ టెక్నాలజీతో సీన్స్‌ తీయడం ఇదే మొదటిసారి. నాకు కమర్షియల్‌ సినిమా అంటే పిచ్చి. ఎందుకంటే కామెడీ, ఫైట్స్, పాటలు.. ఇలా అన్ని ఒకే చోట దొరికేది కమర్షియల్‌ సినిమాలోనే. ‘ఆకతాయి’ హైలెట్స్‌ గురించి చెప్పుకోవాలంటే టెక్నాలజీతో పాటు మణిశర్మ సంగీతం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమా పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా చేశారు. మణిశర్మ గారు నాతో మాట్లాడుతూ – ‘నాకు ఇది చాలా చిన్న సినిమా అని చెప్పి రెమ్యూనరేషన్‌ మాట్లాడారు. కానీ, చిన్న సినిమాల్లో ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది’ అన్నారు. ప్రతి పది నిమిషాలకు సినిమాలో ఒక్కో కొత్త క్యారెక్టర్‌ ఎంటర్‌ అవుతూ ఉంటుంది.

►  ఈ సినిమా పాయింట్‌ గురించి చెప్పాలంటే... ఇది ఒక రివెంజ్‌ సబ్జెక్ట్‌. హీరో చాలా తెలివైనవాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై విపరీతమైన పట్టు ఉంటుంది. తనకు వచ్చిన సమస్యను టెక్నికల్‌ నాలెడ్డ్‌తో ఎలా పరిష్కరించాడన్నదే చిత్రకథ.

►  ‘దావతే ఇష్క్‌’ అనే హిందీ మూవీలో ఈ చిత్రకథానాయికుడు ఆశిష్‌రాజ్‌  గెస్ట్‌ రోల్‌ చేశాడు. గతంలో ఆశిష్‌ థియేటర్‌ ఆర్టిస్టు. రుక్సార్‌ మీర్‌ మా చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఇద్దరూ అద్భుతంగా నటించారు. ‘గజిని’ తరువాత  తనకు గుర్తుండిపోయే విలన్‌ పాత్రల్లో ఈ చిత్రంలోని పాత్ర నిలుస్తుందని ప్రదీప్‌ రావత్‌ అన్నారు. అమీషా పటేల్‌ చాలా గ్యాప్‌ తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్న సినిమా ఇది. ఆమె చేసిన స్పెషల్‌ సాంగ్‌ సినిమాకే హైలైట్‌.

► ఈ చిత్ర నిర్మాతలు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎంతో పేరు సంపాదించారు. సినిమాపై ఉన్న ప్రేమతో నిర్మాతలుగా మారారు. పేరుకి ఇది చిన్న సినిమా అయినా పెద్ద చిత్రానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఖర్చుకి వెనకాడకుండా తీశారు.

Advertisement
Advertisement