సీనియర్‌ నటుడు మృతి | Sakshi
Sakshi News home page

సీనియర్‌ నటుడు మృతి

Published Wed, Aug 16 2017 8:37 AM

సీనియర్‌ నటుడు మృతి - Sakshi

తమిళసినిమా: సీనియర్‌ నటుడు షణ్ముగసుందరం (79) మంగళవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. చెన్నైలో పుట్టి పెరిగిన ఈయన కళాశాల రోజుల్లోనే నటనపై ఆసక్తితో రంగస్థల నటుడిగా అవతారమెత్తారు. పలు నాటకాలను ఆడిన షణ్ముగసుందరం ఒక నాటకంలో హిట్లర్‌ పాత్రలో ఆయన నటన చూసిన నటుడు శివాజీగణేశన్‌ తన రక్తతిలకం చిత్రంలో అవకాశం కల్పించారు. ఆ తరువాత కర్ణన్‌ చిత్రంలో శల్య మహారాజుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలా సినీరంగంలోకి ప్రవేశించిన షణ్ముగసుందరం వందకు పైగా చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వివిధ రకాల పాత్రలను పోషించి గుర్తింపు పొందారు. ఈయన నటించిన చిత్రాల్లో కిళక్కువాసల్, గరగక్కారన్, నమ్మ ఊరు రాసా, చెన్నై 28, నన్భన్, అచ్చమిండ్రి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. షణ్ముగసుందరం నటించిన చివరి చిత్రం అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌.

స్థానిక మైలాపూర్‌లో నివశిస్తున్న షణ్ముగసుందరం మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సమీపంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈయనకు భార్య ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. షణ్ముగసుందరం భౌతికకాయానికి నటుడు శివకుమార్, రాధారవి, మనోబాలా, ప్రేమ్‌జీ నివాళులర్పించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. షణ్ముగసుందరం అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. 

Advertisement
Advertisement