కోవై పోలీసులకు శింబు లొంగుబాటు | Sakshi
Sakshi News home page

కోవై పోలీసులకు శింబు లొంగుబాటు

Published Tue, Feb 23 2016 9:53 AM

కోవై పోలీసులకు శింబు లొంగుబాటు - Sakshi

చెన్నై: ఎట్టకేలకు నటుడు శింబు సోమవారం కోవై పోలీసులకు లొంగిపోయాడు. బీప్ సాంగ్ వ్యవహారం ఇటీవల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ బీప్ సాంగ్‌కు కారకులంటూ నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌లపై ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదు చేశారు. మహిళా సంఘాల ఆందోళలు, కేసుల నమోదు, కోర్టుల్లో పిటిషన్లు అంటూ పెద్ద సంచలనానికే దారితీయడంతో కొన్ని రోజుల పాటు శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో కెనడాలో ఉన్న సంగీత దర్శకుడు అనిరుద్ ఇటీవల రహస్యంగా కోవై పోలీసుల ఎదుట హాజరై బీప్ సాంగ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

శింబు మాత్రం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. అయితే శింబు కోవై పోలీసుల ఎదుట హాజరు కావలసిందేనంటూ ఆదేశిస్తూ కాస్త సమయమిచ్చి అవకాశాన్ని కల్పించింది.ఈ నేపథ్యంలో శింబు సోమవారం కోవై పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయారు. శింబు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో విమానంలో చెన్నై నుంచి కోవైకి చేరుకున్నారు. ఆయనతో పాటు తన తండ్రి టీ.రాజేందర్, న్యాయవాది శింబుతో పాటు ఉన్నారు. కోవైలోని ఒక హోటల్‌లో దిగిన శింబు బృందం ఉదయం 10 గంటలకు స్థానిక గాంధీపురం, కాట్టూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అసిస్టెంట్ కమిషనర్ రమేశ్‌కృష్ణన్, సబ్‌ ఇన్‌స్పెక్టర్ సెల్వరాజ్, ఎస్‌ఐ ప్రేమలు వేసిన ప్రశ్నలకు శింబును వివరణ ఇచ్చాడు. ఆ తరువాత 10.20 గంటలకు శింబు బృందం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై ప్రస్తుతం తానేమీ చెప్పలేనని శింబు పేర్కొన్నాడు.

పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చానని ఆపై భగవంతుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించాడు. కాగా శింబు పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న సమాచారం తెలియడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున్న అక్కడికి తరలి వచ్చారు. శింబును చూడటానికి పోలీస్‌స్టేషన్ లోనికి చొరబడ ప్రయత్నించగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. శింబు లొంగుబాటు సమయంలోనూ అక్కడ కొంత కలకలం చెలరేగినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement