వీరనారిపై వార్‌ మూవీ | Sakshi
Sakshi News home page

వీరనారిపై వార్‌ మూవీ

Published Thu, May 10 2018 12:17 AM

Alia Bhatt thriller movie - Sakshi

ఆమె ఇండియన్‌. ఆమె భర్త పాకిస్తానీ. అతడు ఇండియాను దెబ్బదీసే వ్యూహాల విభాగంలో పనిచేస్తుంటాడు. అది తెలిసే ఆమె అతడిని పెళ్లి చేసుకుని ఆ దేశం వెళుతుంది!

మే 11న బాలీవుడ్‌ చిత్రం ‘రాజీ’ విడుదల అవుతోంది. మేఘనా గుల్జార్‌ డైరెక్ట్‌ చేశారు. ఆలియాభట్‌ హీరోయిన్‌. 1971 ఇండో–పాక్‌ యుద్ధకాలం నాటి థ్రిల్లర్‌ ఇది. ఆ యుద్ధంలో సెహ్‌మత్‌ అనే భారతీయ యువతి.. పాకిస్తాన్‌ రహస్యాలను తెలుసుకోవడం కోసం ఆ దేశంలో గూఢచారిగా పని చేస్తుంది. ధైర్యసాహసాలతో కూడిన ఆ సెహ్‌మత్  రియల్‌ లైఫ్‌ స్టోరీనే ‘రాజీ’. సెహ్‌మత్‌గా ఆలియా, సెహ్‌మత్‌ భర్తగా విక్కీ కౌశల్‌ నటిస్తున్నారు. హరీందర్‌ సిఖా రాసిన ‘కాలింగ్‌ సెహ్‌మత్‌’ పుస్తకం ఈ సినిమాకు ఆధారం. ఒక మహిళా గూఢచారి ఏవిధంగా స్పయింగ్‌ చేసి, తన దేశాన్ని రక్షించిందో మనం ఈ సినిమాలో చూడొచ్చు.

థియేటర్‌లో కూర్చొని చూడ్డానికి స్పయింగ్‌ (గూఢచర్యం) మూవీ భలే ఉత్తేజకరంగా ఉంటుంది. జేమ్స్‌బాండ్‌ని చూస్తున్నాం కదా! చలాకీగా, ఒడుపుగా శత్రుదేశం నుంచి ఇన్ఫర్మేషన్‌ని లాగేసి తెచ్చేస్తుంటాడు. రియల్‌ లైఫ్‌లో అలా ఉండదు. అడుగడుగునా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. ‘‘అయితే ఇదేమీ ఆలోచించలేదు సెహ్‌మత్‌’ అని సిఖా తన పుస్తకంలో రాశారు.

సెహ్‌మత్‌కు అప్పుడు 20 ఏళ్లు. కశ్మీర్‌లో పేరున్న ఒక బిజినెస్‌మన్‌ కూతురు ఆ అమ్మాయి. 1971 ఇండో–పాక్‌ యుద్ధానికి కాస్త ముందు భారత ప్రభుత్వపు స్పైగా ఆమె రిక్రూట్‌ అవుతుంది. అనుమానం రాకుండా కూపీలు లాగడంలో, విలువైన సమాచారాన్ని సేకరించడంలో శిక్షణ పొందుతుంది. అంతేనా! ఒక పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్‌ని పెళ్లి చేసుకుని ఆ దేశం వెళుతుంది. ఆమె భర్త ఇండియాను దెబ్బదీసే వ్యూహాల విభాగంలో పనిచేస్తుంటాడు. అది తెలిసే ఆమె అతడిని పెళ్లి చేసుకుంటుంది.

అలా గూఢచర్యం చేస్తుండగా, పాక్‌ మన యుద్ధ నౌక ఐ.ఎన్‌.ఎస్‌. విరాట్‌ను పేల్చేయాలని పథకం వేస్తున్న విషయం ఆమె పసిగడుతుంది. వెంటనే ఇండియాను అలర్ట్‌ చేస్తుంది. ఒక పెద్ద యుద్ధవిపత్తు నుంచి తన దేశాన్ని, ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది. ఇదంతా కూడా సిఖా.. సెహ్‌మత్‌ కుటుంబ సభ్యుల భద్రత కోసం ఒక కల్పిత గాథగా రాశారు. అలాగని అందులో కల్పితాలేమీ లేవు. సినిమా కూడా అదే లైన్‌లో సాగుతుంది. యుద్ధకాలంలో దేశానికి ఏదో ఒకరూపంలో సేవలు అందించి అజ్ఞాతంగా ఉండిపోయి ఎందరో మహిళల్లో సెహ్‌మత్‌ ఒకరు. స్పైగా స్ఫూర్తిని ఇచ్చే ఆమె శక్తియుక్తులను మనం ‘రాజీ’ చిత్రంలో చూడొచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement