వినోదంగా దోచేస్తాడు! | Sakshi
Sakshi News home page

వినోదంగా దోచేస్తాడు!

Published Tue, Jun 10 2014 10:56 PM

వినోదంగా దోచేస్తాడు! - Sakshi

 అల్లరి నరేశ్ ‘బందిపోటు’గా మారారు. అయితే... ఆయన చేసేది వినోదంతో కూడిన దోపిడి. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ ‘బందిపోటు’కు నిర్దేశకుడు. ఈవీవీ సినిమా పతాకంపై ఆర్యన్ రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ఈవీవీ సత్యనారాయణ జయంతి సందర్భంగా ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి డి.సురేశ్‌బాబు కెమెరా స్విచాన్ చేయగా, డి.రామానాయుడు క్లాప్ ఇచ్చారు. ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ -‘‘సినిమాపై నాకు అభిమానం పెరగడానికి, సినీరంగం వైపు నా అడుగులు పడటానికి కారణం ఈవీవీ సత్యనారాయణ.
 
  ఇప్పుడు ఆయన సంస్థ నిర్మించే చిత్రానికి నేను దర్శకుణ్ణి కావడం గర్వంగా ఉంది. ఇది చక్కని వినోదంతో కూడిన కథ. ఇందులో వ్యంగ్యాస్త్రాలు కానీ, పేరడీలు కానీ ఉండవు’’ అని చెప్పారు. ‘‘ఇంద్రగంటి సినిమా అనగానే ఇదేదో ప్రయోగమని అందరూ భావిస్తున్నారు. అయితే ఇది అలాంటి సినిమా కాదు... పూర్తి వినోదాత్మక చిత్రం. ఈ సినిమాకు అన్నయ్య రాజేశ్ నిర్మాత. ఇక నుంచి మా సంస్థలో బయట హీరోలతోనూ సినిమాలు చేస్తాం. అందుకని అన్నయ్య నిర్మాణానికే అంకితమవుతారని అనుకోవద్దు.
 
 మంచి పాత్రలు దొరికితే... విలన్‌గా కనిపించడానికి కూడా అన్నయ్య రెడీగా ఉన్నారు. త్వరలో ఆయన్ను తెరపై విలన్‌గా చూడొచ్చు’’అని తెలిపారు అల్లరి నరేశ్. ఆర్యన్ రాజేశ్ మాట్లాడుతూ -‘‘మా సంస్థ నిర్మించే సినిమా నాన్న గౌరవం పెంచేలా ఉండాలి. అందుకే మంచి కథ కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశాం. జూలై తొలివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం. బాలీవుడ్ యశ్‌రాజ్ సంస్థ స్థాయిలో ‘ఈవీవీ సినిమా’ను నిలబెట్టాలనేది మా ధ్యేం. ఇక నుంచి టీవీ సీరియల్స్ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని చెప్పారు. కథానాయిక ఈషా, సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి, కెమెరామేన్ పీజీ విందా మాట్లాడారు.
 

Advertisement
Advertisement