యాక్షన్‌ ఎడ్వెంచర్‌ చిత్రంగా ఆల్ఫా

11 Aug, 2018 09:23 IST|Sakshi
ఆల్ఫా చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: సూపర్‌ యాక్షన్‌  ఎడ్వెంచర్‌ చిత్రంగా ఆల్ఫా హాలీవుడ్‌ చిత్రం భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మానవుడు, జంతువు అనే అసాధారణ స్నేహబంధంతో ఇంతకు ముందు వచ్చిన జంగిల్‌బుక్‌ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా అలాంటి మరో కోణంలో తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం ఆల్ఫా. ఇది చారిత్రక యాక్షన్‌ ఎడ్వెంచర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. ఇది ఒక యువకుడు, తోడేలు మధ్య మిత్రత్వం, వారు ఎదుర్కొనే సాహసాలు ఇతివృత్తంగా సాగే కథా చిత్రం. 20 వేల సంవత్సరాల క్రితం అడవి ప్రాంతాల్లో నివశించే జాతికి చెందిన కొందరు వారి జీవనాధారమైన వేటకు వెళతారు. అందులో ఒక కుర్రాడు తప్పిపోతాడు.

ఆ కుర్రాడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. అదే పరిస్థితిలో ఉన్న తోడేలు ఆ కుర్రాడికి తారస పడడం వారి మధ్య స్నేహబంధం ఏర్పడడం, అనంతరం ఎదురైన సమస్యలను ఎలా కలిసి ఎదుర్కొన్నారు? లాంటి పలు ఆసక్తికరమైన, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో సాగే చిత్రం ఆల్ఫా. నాయకుడు లేనప్పుడు నువ్వే నాయకుడిగా మారాలి అన్న తండ్రి మాటల ప్రభావంతో తప్పిపోయిన ఆ కుర్రాడు ఎలా శత్రువులను ఎదుర్కొన్నాడు? లాంటి సాహసోపేతమైన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కొడి స్మిత్‌ మెక్‌ఫీ, లెఓనర్‌ వరేలా, జెన్స్‌హల్టెన్, జోహన్స్‌ హక్కర్‌ జోహన్‌సన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, సహ నిర్మాత, దర్శకత్వం బాధ్యతలను ఆల్బర్ట్‌ హగ్స్‌ నిర్వహించారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో సోనీ పిక్చర్స్‌ సంస్థ 24న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు