రాధాకృష్ణలపై పుస్తకం పెద్ద సాహసం – తనికెళ్ల భరణి | Sakshi
Sakshi News home page

రాధాకృష్ణలపై పుస్తకం పెద్ద సాహసం – తనికెళ్ల భరణి

Published Fri, Oct 6 2017 1:49 AM

Anchor and Artist Rani Chitralekha's Vannepula Vinnapalu book release

‘రాధాకృష్ణలపై పుస్తకం రాసి, చిత్రలేఖ చాలా పెద్ద సాహసం చేశారు. పుస్తకంలో ఎక్కువ భాగం అంశాలు బాగున్నాయి. ఆమెలో మంచి రచయిత్రి ఉన్నారు’’ అని నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. ‘శంభో శివ శంభో’, ‘పరుగు’, ‘దమ్ము’, ‘లయన్‌’ తదితర చిత్రాల ద్వారా నటిగా చిత్రలేఖ సుపరిచితు రాలే.

యాంకర్‌గా, బుల్లితెర నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె రచించిన ‘వన్నెపూల విన్నపాలు’ పుస్తకాన్ని సీనియర్‌ రచయిత శివారెడ్డితో పాటు పలువురు రచయితలు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘నా ఎదుగుదలలో చిత్రలేఖ పాత్ర ఉంది. నేను, ఆమె కలిసి చేసిన ప్రోగ్రామ్స్‌ నా రాజకీయ రంగానికి పనికొచ్చాయి.

మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి, పోటీని తట్టుకుని చిత్రలేఖ సక్సెస్‌ అయ్యారు’’ అన్నారు. ‘‘నాలో కవయిత్రిని గుర్తించింది జనార్ధన్‌ మహర్షిగారు. తనికెళ్ల భరణిగారు నాకు స్ఫూర్తి. చంద్రబోస్‌గారు ఇంట్లో నాకు తొలిసారి సన్మానం చేశారు. ఈ పుస్తకం విషయంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సౌభాగ్య, గొల్లపూడి మారుతీరావుగార్ల  సహకారం మరువలేనిది’’ అన్నారు రాణి చిత్రలేఖ. దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ, పాటల రచయిత చంద్రబోస్, మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా, నిర్మాత లగడపాటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement