అవార్డులు మీ తెల్లవాళ్లకేనా? | Sakshi
Sakshi News home page

అవార్డులు మీ తెల్లవాళ్లకేనా?

Published Mon, Feb 15 2016 12:04 PM

అవార్డులు మీ తెల్లవాళ్లకేనా?

లండన్‌: హాలీవుడ్ చిత్రపరిశ్రమలో తెల్లజాతీయులు, పురుషుల ఆధిపత్యమే సర్వత్రా రాజ్యమేలుతుండటం ఇప్పుడు పెద్ద వివాదమే రేపుతోంది. హాలీవుడ్‌లో భిన్నత్వమే లేకపోవడం, నల్లజాతీయులకు, మహిళలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఇప్పుడు నిరసన వ్యక్తమవుతోంది. అవార్డుల ప్రదానోత్సవంలోనూ ఈ వివక్ష కొట్టొచ్చినట్టు కనబడుతుండటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హాలీవుడ్‌లోని ఈ వివక్షను వ్యతిరేకిస్తూ క్రియేటివ్‌ ఆఫ్ కలర్‌ నెట్‌వర్క్‌ గ్రూప్ అనే హక్కుల సంస్థ.. బాఫ్టా అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది.

ఈ నిరసన ప్రదర్శనకు 'ఎలియన్ 3' నటుడు లియోన్ హెర్బర్ట్‌ నేతృత్వం వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఉద్యమకారులు నలుపు, తెలుపు దుస్తులు ధరించి.. 'లైట్, యాక్షన్, డైవర్సిటీ' అంటూ నినాదాలు చేశారు. బాఫ్టా మాస్కులతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. లండన్‌లోని రాయల్ ఓపెరా హౌస్ బయట ఈ నిరసన ప్రదర్శన ప్రశాంతంగా జరిగింది. హాలీవుడ్ సినిమా/టీవీ పరిశ్రమలో అందరికీ అవకాశాల కల్పన, భిన్నత్వం లేకపోవడం పట్ల 1990 నుంచి ఉద్యమం జరుగుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదని, బాఫ్టా అవార్డుల నామినేషన్ల విషయంలోనూ నల్లజాతి కళాకారులకు అన్యాయమే జరిగిందని, ఏదో నామమాత్రంగా వారికి నామినేషన్లు ప్రకటించారని ఉద్యమకారులు తమ ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement