బాహుబలి 2 స్పెషల్‌ షో రద్దు

27 Apr, 2017 14:07 IST|Sakshi
బాహుబలి 2 స్పెషల్‌ షో రద్దు
ముంబయి: ముంబయిలో బాహుబలి-2 ప్రత్యేక ప్రదర్శనను రద్దు చేశారు. ఈ మేరకు బాహుబలి చిత్రం హిందీ హక్కులు తీసుకున్న ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌ ప్రకటించారు. బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా మృతి నేపథ్యంలో ఆయనకు సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో బాలీవుడ్‌ సీని ప్రముఖులకు వేసే ప్రత్యేక ప్రదర్శన కూడా ఆగిపోయింది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు 'వినోద్ ఖన్నా' గురువారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బ్లాడర్‌ క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. 1968లో సినీ రంగ ప్రవేశం చేసిన వినోద్ ఖన్నా తనదైన నటన..డైలాగ్స్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తరువాత హీరోగా మారి 141 చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం 'దిల్ వాలే'.