బలుపు సినిమా రివ్యూ

29 Jun, 2013 03:47 IST|Sakshi
బలుపు సినిమా రివ్యూ
వరస పరాజయాలతో టాలీవుడ్ లో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న రవితేజ.. డాన్ శ్రీను దర్శకుడు గోపిచంద్ మలినేనితో కలిసి మరోసారి బలుపు చిత్రంతో జూన్ 28 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వినోదం, యాక్షన్ మేలవింపుతో రూపొందిన బలుపు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిపోర్టును, ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో వేచి చూడాల్సిందే! తన తండ్రితో కలిసి బెంగుళూరులో జీవిస్తున్న రవి ఓ బ్యాంక్ లో రికవరీ ఏజెంట్. తన స్నేహితుడిని మోసగించిన శృతి, క్రేజి మోహన్ లకు రవి తగిన బుద్ది చెప్పాలనుకుంటాడు. అయితే రవిపై ప్రేమ పెంచుకున్న శృతి ఆవిషయాన్ని తన తండ్రికి చెప్పి ఒప్పించుకుంటుంది. అయితే శృతి, రవిల ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ ను వైజాగ్ పూర్ణ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ రవి, శృతిల పెళ్లి జరుగుతుందా, అంజలి ఎవరు, రవి ఎంగేజ్ మెంట్ ను ఎందుకు వైజాగ్ పూర్ణ ఎందుకు అడ్డుకోవాలనుకుంటాడు అనే ప్రశ్నలకు సమాధానమే బలుపు చిత్ర కథ.
 
బలుపు చిత్రంలో రవితేజ రవి, శంకర్ అనే రెండు షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్, సెకండాఫ్ లో యాక్షన్ తో రవితేజ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రవితేజకు ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రను పోషించడం కొట్టిన పిండే. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ డైలాగ్స్  తో రవితేజ వినోదాన్ని పంచడంలో సఫలీకృతమయ్యాడు. క్రేజి మోహన్ (బ్రహ్మనందం)తో కలిసి శృతి హాసన్ కామెడిని ఓమోస్తారు పండించింది. అంజలి పాత్ర సినిమాకు పెద్దగా ప్లస్ అయ్యే దాఖలాలు లేవు. అయితే తన పాత్ర పరిధి మేరకు అంజలి ఓకే అనిపించింది. అయితే శృతి హాసన్ గ్లామర్ తో ఈ చిత్రంలో ప్రత్యేకతను నిలబెట్టుకుంది. బ్రహ్మనందం గ్యాంగ్ నమ్ డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చి... మరోసారి తనదైన హాస్యంతో చిత్రానికి వెన్నుముకగా నిలిచాడు. అయితే బ్రహ్మనందం హాస్యం అక్కడక్కడ రొటిన్ గా అనిపించింది. ప్రకాశ్ రాజ్ తండ్రి పాత్రలో ఓకే అనిపించాడు. అశుతోష్ రాణాకు ఈ చిత్రం పెద్దగా పేరు తెచ్చే అవకాశం కనిపించడం లేదు.
 
దర్శకుడు మలినేని గోపిచంద్ తొలిభాగాన్ని ఎంటర్ టైన్ మెంట్ తో నడిపించి.. ద్వితీయార్ధంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో యాక్షన్ ను నమ్ముకున్నాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో కొత్తేమి లేకపోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురవ్వడం ఖాయం. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ను కొత్తగా ముగించడంతో కొంత ఊరట లభిస్తుంది. క్లైమాక్స్ లో ఐపీఎల్ థీమ్ మ్యూజిక్ జంపక్.. జంపక్ తో కామెడీని పండించి.. సరికొత్త ముగింపు ఇవ్వడం కొత్తగా ఉంది. చిత్ర రెండవ భాగంపై దర్శకుడు మరికాస్తా శ్రద్ద పెట్టి ఉంటే..బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉండేది.  ఈ చిత్రంలో థమన్ మ్యూజక్ నిరాశపరిచింది. 'ముందు డైలాగ్ కొట్టాలా..లేక మిమ్మల్ని కొట్టాలా'.. రెండింటిలోనూ పంచ్ ఉంటుంది'.. 'నేను కాజువల్ గా కొడితేనే కాజువాలిటీ లోకి వెళ్తారు.. అదే కాన్ సెంట్రేట్ చేసి కొడితే కోమాలోకే'... 'ఏ ఫియర్ లేనోడే.. ఎందులోనైనా ఇంటర్ ఫియర్ అవుతాడు'.. 'నేను వదిలేసింది రౌడీయిజమే..నాలో బలుపును కాదు' లాంటి డైలాగ్స్ తో రవితేజ్ రఫ్ ఆడించాడు.
 
వరుస పరాజయాలతో చిత్ర పరిశ్రమలో గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న రవితేజ.. గతంలో చిత్రాల కంటే కొంత బెటర్ గా ఉంది.. అయితే కామెడీని, రవితేజ నటన, శృతి హాసన్ గ్లామర్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే అంశంపైనే చిత్ర విజయం ఆధారపడిఉంటుంది.