ఆ రోజు... పెద్ద పండగ చేసుకుంటాం! | Sakshi
Sakshi News home page

ఆ రోజు... పెద్ద పండగ చేసుకుంటాం!

Published Tue, Aug 25 2015 12:40 AM

ఆ రోజు...  పెద్ద పండగ చేసుకుంటాం!

‘‘పిల్లా నువ్వు లేని జీవితం’ విజయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. సక్సెస్ వేరు. మనసుకి నచ్చిన సక్సెస్ వేరు. ఆ చిత్రం రెండోరకం అనుభూతిని మిగిల్చింది’’ అని దర్శకుడు ఎ.యస్. రవికుమార్ చౌదరి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రవికుమార్ చౌదరి మాట్లాడుతూ - ‘‘గోపీచంద్‌తో ‘యజ్ఞం’ చేసిన పదేళ్లకు మళ్లీ తనతో కొత్త సినిమా చేస్తున్నాను. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్న మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇప్పటివరకూ గోపీచంద్ సినిమాల్లో హయ్యస్ట్ కాస్టింగ్, బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం ఇదే. టైటిల్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ చిత్రం ద్వారా ఒక మంచి స్క్రిప్ట్‌ను హ్యాండిల్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత ఆనంద్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి, రచయిత శ్రీధర్ సీపానలకు నా ధన్యవాదాలు.

డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఆ రోజు పెద్ద పండగ చేసుకోనున్నాం. అంత కాన్ఫిడెన్స్ ఉంది’’ అన్నారు. ‘‘రకరకాల కారణాల వల్ల ఇంతకు ముందు నా కెరీర్‌లో సినిమాకీ, సినిమాకీ మధ్య గ్యాప్ ఎక్కువుం డేది. ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తా’’ అని రవికుమార్ చౌదరి చెప్పారు. ‘యజ్ఞం’, ‘బ్రోకర్’ చిత్రాల్లో లాగా ఇకపైనా నటిస్తారా అని అడిగినప్పుడు - ‘‘సరదా కోసం ఆ చిత్రాల్లో చిరుపాత్రలు చేశాను. నా దృష్టిలో డెరైక్టర్ ఇంజిన్ లాంటివాడు. నేనెప్పుడూ అలా ట్రైన్ ఇంజిన్‌లానే ఉండాలనుకుంటున్నా. అన్ని బోగీలను ఇంజిన్‌లా లాగడంలో ఓ తృప్తి ఉంటుంది’’ అని రవికుమార్ అన్నారు. ‘‘ఏ నిర్మాత అయినా తాను నిర్మించే చిత్రం సేలబులిటీని చూసుకుంటాడు. హీరోలు కూడా సక్సెస్‌ఫుల్ డెరైక్టర్‌తో సినిమా చేయాలనుకుంటారు. నేనూ హీరోల సక్సెస్ ట్రాక్‌ను పరిశీలించుకుంటాను. సో.. సక్సెస్‌లో ఉన్నవాళ్లకే అవకాశాలు ఇస్తారనే విషయాన్ని నేను తప్పుపట్టను’’ అని చెప్పారు. ఓ యువ హీరోతో పెద్ద సంస్థలో జనవరిలో సినిమా చేయనున్నానని, భవిష్యత్తులో కల్యాణ్ రామ్, సాయిధరమ్‌లతో చేసే అవకాశం ఉందని రవికుమార్ చౌదరి తెలిపారు.
 
 

Advertisement
Advertisement