తొలి వీఆర్ సినిమాకు భారత్‌లో శ్రీకారం | Sakshi
Sakshi News home page

తొలి వీఆర్ సినిమాకు భారత్‌లో శ్రీకారం

Published Fri, Jul 15 2016 5:33 PM

తొలి వీఆర్ సినిమాకు భారత్‌లో శ్రీకారం

న్యూఢిల్లీ: ‘డిస్‌ప్లేస్డ్’ అనే వర్చువల్ రియాలిటీ (వీఆర్) సినిమాను మనం చూస్తే ఎలాంటి అనుభూతి చెందుతాం? వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల్లో బతుకు చిధ్రమైన ముగ్గురు శరణార్థి పిల్లలు తమ విషాధ గాధలను వివరించి చెప్పడమే ఆ సినిమా కథ. ఆ సినిమాను చూస్తున్న మనం వారితో ప్రత్యక్ష్యంగా మాట్లాడవచ్చు. వారితో కలసి పక్క పక్కనే నడవచ్చు. వారిని తాకిన స్పర్శ అనుభూతిని కూడా పొందవచ్చు. అదే బాహుబలి సినిమాను వీఆర్‌లో చూశామనుకోండి? బాహుబలి స్థానంలో అంటే, ప్రభాస్ స్థానంలో ఎత్తై జలపాతాలను మనమూ ఎక్కవచ్చు. ఇదే వీఆర్ టెక్నాలజీ సినిమా సృష్టించే మాయాజాలం.

వీఆర్ సినిమాలకు హాలివుడ్ ఎప్పుడో శ్రీకారం చుట్టినప్పటికీ భారత్ మాత్రం ఇంకా వెనకబడే ఉంది. ఇక ఆ బెంగ కూడా ఎంతో కాలం అక్కర్లేదు. బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ గాంధీ భారత్‌లో తొలిసారిగా వీఆర్ సినిమాను తీస్తున్నారు. ‘షిప్ ఆఫ్ థీసియస్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆనంద్ గాంధీ వినూత్న దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం తెల్సిందే. ఆయన తీసిన తొలి చిత్రానికి జాతీయ ఉత్తమ ఫీచర్ సినిమాతోపాటు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి.
 
భారత్‌లో తొలి వీఆర్ సినిమాను తీసేందుకు ఆయన ‘మెమిస్ కల్చర్ ల్యాబ్’ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఆయన రచయితలను, సినిమా నిర్మాతలను, ఇన్నోవేటర్లు, విజువల్ కళాకారులు, మేథావులతో పెద్ద ఎత్తున సంప్రతింపులు జరుపుతున్నారు.

ప్రముఖ డాక్యుమెంటరీ డెరైక్టర్ ఫైజ్ అహ్మద్ ఖాన్ సహాయ సహకారాలు కూడా ఆనంద్ గాంధీ తీసుకుంటున్నారు. ఫైజ్ అహ్మద్‌ఖాన్ ఇటీవలనే చత్తీస్‌గఢ్‌లోని గనులపైనా ‘కాస్ట్ ఆఫ్ కోల్’ అనే డాక్యుమెంటరీని వీఆర్ టెక్నాలజీతో తీశారు. తాను తన సినిమా కోసం ఇశాక్ అశ్మోవ్ తదితరులు రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలు చదివానని ఆనంద్ గాంధీ తెలిపారు. మనసుకు నచ్చినట్లు, హృదయానికి హత్తుకునేలా కథలు చెప్పడంలో భారతీయులు అగ్రగణ్యులేనని, ఆ కథలను వీఆర్ సాంకేతిక పరిజ్ఞానంతో మరింత అనభూతిపరంగా చెప్పవచ్చని ఆయన అంటున్నారు.

టీవీల్లో వీఆర్ వీడియో గేమ్స్, వీఆర్ సినిమాలను చూసే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. వీటిని చూడాలంటే వీఆర్ గ్లాసెస్‌ను ధరించక తప్పదు. ఈ గ్లాసులు మూడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. మున్ముందు సోషల్ మీడియా కూడా వీఆర్ మయమే అవుతుంది. గూగుల్ ప్లే స్టోర్ ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తుండగా, ఫేస్‌బుక్‌ను వీఆర్ మయం చేసేందుకు జుకర్‌బర్గ్ కృషి చేస్తున్నారు. రానున్న యాభై ఏళ్లలో అంగారక గ్రహంపై మానవులు నివాసం ఏర్పాటు చేసుకుంటారో, లేదో చెప్పలేముగానీ ఈ వీఆర్ పరిజ్ఞానం ద్వారా మాత్రం అది సాధ్యమవుతుంది.

Advertisement
Advertisement