'ఓవైసీ వర్సెస్ సల్లూభాయ్' | Sakshi
Sakshi News home page

'ఓవైసీ వర్సెస్ సల్లూభాయ్'

Published Tue, Jan 28 2014 11:54 PM

'ఓవైసీ వర్సెస్ సల్లూభాయ్'

రాజకీయ పార్టీల నిర్ణయాలు ఒక్కోసారి ప్రజలను విస్మయానికి గురిచేయడమే కాకుండా అనేక వివాదాలకు దారి తీస్తుంటాయి. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు గతంలో పెద్ద దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే తెరమరుగవుతున్నాయని అనుకుంటున్న సమయంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరతీసాయి. ఈసారి ఓవైసీ చేసిన వ్యాఖ్యలు హిందువులను ఉద్దేశించి చేసినవి కాకపోవడం కొంత ఊరట కలిగించే అంశం. అయితే ఎంఐఎం అధినేత టార్గెట్ చేసుకుంది ఆయన వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆసక్తిని కలిగించేదైతే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను లక్ష్యం చేసుకోవడం వివాదానికి మరింత గ్లామర్ ను తెచ్చింది. ఇక సల్మాన్ ఖాన్ పై ఓవైసీలు 'గుస్సా'కు కారణం ఆయన బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో కలిసి పతంగులు ఎగురవేయడం.. ఆతర్వాత విందు ఆరగించడం. అక్కడికే సల్మాన్ ఖాన్ పరిమితమైతే వివాదంగా మారకపోయి ఉండేది కాదేమో.
 
సల్మాన్ తన తాజా చిత్రం 'జై హో' చిత్ర ప్రమోషన్ కోసం గుజరాత్ వెళ్లడం.. ఆసమయానికే మోడీ పతంగులు ఎగురవేస్తుండటం.. తప్పని పరిస్థితుల్లో ఆయనతో కలిసి పతంగులు గాలిలోకి వదలడం జరిగింది. అక్కడే ఉన్న మీడియా సల్మాన్ ను కదిలించే సరికి ... మోడీని మంచి వ్యక్తి అని.. మంచి వ్యక్తే ప్రధాని పదవికి అర్హుడని  సల్లూభాయ్ వ్యాఖ్యానించడం ఓవైసీ పార్టీకి పుండు మీద కారం చల్లినంత పనైంది. గుజరాత్ అల్లర్లకు కారణమైన మోడీని కీర్తించినందుకు సల్మాన్ క్షమాపణలు చెప్పాలని.. లేనిచో  'జై హో'ను బహిష్కరించాలని, ఆ చిత్రాన్ని చూడకూడదు అంటూ  కార్యకర్తలకు, అభిమానులకు ఎంఐఏం పార్టీతోపాటు ఇతర మత పెద్దలు హుకుం జారీ చేయడం వివాదస్పదమైంది. అయితే అదే వర్గానికి చెందిన అభిమానులు, కార్యకర్తల నుంచి ఓవైసీకి సరియైన స్పందన లభించలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. 
 
ఎంఐఎం పార్టీ ఇచ్చిన పిలుపును సల్మాన్ ఖాన్ లైట్ గానే తీసుకున్నట్టు కనిపించింది. 'నేను సగం హిందువును, సగం ముస్లింను' అని బహిరంగంగా చెప్పుకునే సల్మాన్.. ఓవైసీ స్పందనను లెక్కలోకి తీసుకోకపోవడం గమనార్హం. 'నా తల్లి హిందువు, తండ్రి ముస్లిం. నాకు రెండు కమ్యూనిటీలతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. హిందు, ముస్లింల మధ్య మంచి సంబంధాలు ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. అయితే ఎవరికి మద్దతివ్వాలో ప్రజలకు సంబంధించిన అంశం. నా నిర్ణయం ఎవ్వరి మీద కూడా ప్రభావం చూపదు' అని స్పష్టం చేశాడు సల్మాన్. జై హో ప్రమోషన్ లో మోడీతో కలిసి పతంగులు ఎగురవేయడం నేరమా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారాయన. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ను అడ్డుకునేంత శక్తి అసదుద్దీన్ ఓవైసీకి లేదు అని వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై స్పందించిన తీరు బట్టి చూస్తే రాజకీయ నేతలకు, మత గురువుల ఆదేశాలకు తలవొగ్గే రకం తాను కాదని సల్మాన్ స్పష్టం చేశారనిపిస్తోంది. 
 
 అయితే అభిమానులు, సినీ ప్రేక్షకుల అంచనాలకు దూరంగా ఉన్న కారణంగా 'జై హో' చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది. ఓవైసీ పిలుపు పాకిస్థాన్ లో కొంత ప్రభావమే చూపినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 'జై హో' చిత్రం తన ఇమేజ్ దూరంగా ఉంది. తన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆ చిత్రం ఫ్లాప్ అంటూ సల్మాన్ బహిరంగంగా వెల్లడించారు. జనవరి 24న విడుదలైన ఈ చిత్రం వారాంతానికి కేవలం 60 కోట్లు వసూలు చేయగలిగింది. 
 
అయితే కళాకారులు, సినీ తారలు కుల, మత, ప్రాంతాలకు అతీతం అనేది కాదనలేని వాస్తవం. ప్రజాస్వామ్య (ముఖ్యంగా లౌకికం అని చెప్పుకునే) వ్యవస్థలో వారు ఎవరినైనా కలువవచ్చు.  సొంత అభిప్రాయాలను వెల్లడించే హక్కు రాజ్యాంగం కల్పించింది. కళాకారులను ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంచాల్సిందే. 

Advertisement
Advertisement