సల్మాన్‌ను పెళ్లికి నేను ఒప్పించగలను! | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ను పెళ్లికి నేను ఒప్పించగలను!

Published Mon, Mar 14 2016 5:28 PM

సల్మాన్‌ను పెళ్లికి నేను ఒప్పించగలను! - Sakshi

ముంబై: యాబై ఏళ్లు వచ్చినా ఇప్పటికీ బ్యాచిలర్‌గా ఉండటమే ఇష్టమని సల్మాన్‌ ఖాన్‌ చెప్తుంటే.. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌ మాత్రం 'భజరంగీ భాయ్‌జాన్‌' ఓ ఇంటివాడైతే చూడాలని ఉందని అంటున్నాడు. తాను గట్టిగా ప్రయత్నిస్తే.. సల్మాన్ ను  పెళ్లికి ఒప్పించగలుగుతానేమోనని చెప్పాడు. 51వ పుట్టినరోజు సందర్భంగా ఆమిర్ సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడాడు. తన ఆప్తమిత్రుడు సల్మాన్ గురించి కూడా అడిగిన ప్రశ్నలకూ పిచ్చాపాటిగా సమాధానాలు ఇచ్చాడు.  

పెళ్లిచేసుకోమని సల్మాన్‌కు ఎప్పుడైనా చెప్పారా? అని అడిగితే.. 'ఇప్పటివరకైతే నేను ప్రయత్నించలేదు. మాములుగా చెప్పిచూశాను. కానీ గట్టిగా ప్రయత్నించలేదు. ఒకవేళ నేను గట్టిగా పట్టుబడి ఉంటే.. నేను సఫలమయ్యేవాడినేమో' అని ఆమిర్ చెప్పాడు. ఆమిర్ ప్రస్తుతం 'దంగల్‌' సినిమా చేస్తున్నాడు. ఇందులో రెజ్లర్ పాత్రను పోషిస్తుండగా.. సల్మాన్ ఖాన్ కూడా రెజ్లర్‌ గా 'సుల్తాన్' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి పోటాపోటీగా విడుదలవుతాయని భావించినప్పటికీ 'సుల్తాన్' వచ్చే జూన్‌లో వస్తుండగా, 'దంగల్' సినిమా వచ్చే డిసెంబర్‌లో రానుందని ఆమిర్ క్లారిటీ ఇచ్చాడు.

అమ్మ కోసం ఆ ఇల్లు కొనాలని ఉంది!
అమ్మ తన బాల్యాన్ని వారణాసిలో గడిపిందని, ఆమె చిన్ననాటి ఇంటిని కొని అమ్మకు కానుకగా ఇవ్వాలని తాను భావిస్తున్నట్టు ఆమిర్ ఖాన్ తెలిపాడు. ఈ ఏడాది అదే అతిపెద్ద కోరిక అని పేర్కొన్నాడు. తన తల్లి గడిపిన ఇంట్లో ఎవరైనా ప్రస్తుతం ఉంటే.. దయచేసి ఆ విషయాన్ని తెలియజేయాలని, తల్లి కోసం ఆ ఇంటిని తాను కొనుగోలు చేస్తానని ఆమిర్ చెప్పాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement