బన్నీ హీరో మెటీరియల్ అని అప్పుడే అనుకున్నాను : చిరంజీవి | Sakshi
Sakshi News home page

బన్నీ హీరో మెటీరియల్ అని అప్పుడే అనుకున్నాను : చిరంజీవి

Published Mon, Mar 17 2014 12:03 AM

బన్నీ హీరో మెటీరియల్ అని అప్పుడే అనుకున్నాను : చిరంజీవి - Sakshi

‘‘సినీ పరిశ్రమలో ఉండే కష్టసుఖాలేంటో తెలుసుకోకపోతే... బన్నీ వైల్డ్ గుర్రంగా మిగిలిపోయేవాడు. తెలుసుకున్నాడు కాబట్టే ‘రేసుగుర్రం’ అయ్యాడు’’ అని చిరంజీవి అన్నారు. అల్లు అర్జున్ కథానాయకునిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రేసుగుర్రం’. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిరంజీవి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని వి.వి.వినాయక్‌కి అందించారు. చిరంజీవి ఇంకా మాట్లాడుతూ-‘‘చిన్నప్పట్నుంచీ బన్నీ యాక్టీవ్. తనకిష్టమైన నటులందర్నీ అనుకరించేవాడు. హాలీవుడ్ యాక్టర్ జిమ్‌క్యారీని, నన్ను, వాళ్ల తాతయ్య రామలింగయ్యగారిని ఇలా అనమాట. అప్పుడే అనుకున్నా ‘వీడు హీరో మెటీరియల్’ అని. హీరో అవ్వాలని కోరుకున్నాను కూడా. 
 
‘డాడీ’ సినిమాలో కథ రీత్యా ఓ డాన్సింగ్ క్యారెక్టర్ ఉంది. ఆ పాత్ర కోసం ఎవరెవర్నో చూస్తుంటే... నేను బన్నీ పేరు సూచించా. ఆ పాత్రే ‘గంగోత్రి’కి కారణమైంది. కానీ... ఆ సినిమాలో బన్నీ నటన నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. బన్నీ అంటే... ఇదికాదు అనిపించింది. ‘దేశముదురు’ చూశాను. అప్పుడనిపించింది. ‘ఎస్... ఇది బన్నీ అంటే’ అని. మా కుటుంబం గర్వించే నటుడు అవుతాడని నిశ్చయించుకున్నాను. సురేందర్‌రెడ్డి ప్రతిభావంతుడైన దర్శకుడు. మొన్ననే టీవీలో తన  ‘కిక్’ సినిమా వచ్చింది. కాసేపు చూద్దాం అనుకొని సినిమా మొత్తం చూసేశాను. రవితేజ చేశాడు కానీ... నా ఫిట్‌నెస్ సరిగ్గా ఉన్న టైమ్‌లో నేను చేసి ఉంటే ఎలా ఉండేదో అనిపించింది. ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి క్యాషియర్లలా తయారైంది. సినిమాలోని ప్రతి విషయంలో నిర్మాతల ఇన్వాల్వ్‌మెంట్ అవసరం. 
 
అప్పుడే సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి. ‘రేసుగుర్రం’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘తమన్‌తో పనిచేయాలని చాలారోజులుగా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకి ప్రతి టెక్నీషియన్ మనసుపెట్టి పనిచేశాడు. ‘తల్లిదండ్రుల ఆస్తి ఎంతైనా ఉండొచ్చు. కానీ మనం సంపాదించుకున్న పదివేలు చేతులో ఉంటే ఆ కిక్కే వేరు’ అనే విషయాన్ని తెలియజేసింది నాకు శ్రుతిహాసన్. పెద్ద సూపర్‌స్టార్ కుమార్తె అయ్యుండి కూడా తాను కష్టపడే తీరు అద్భుతం. మిగిలిన ఇండస్ట్రీల్లోని దర్శకులు తమ సినిమా బాగుండాలని సినిమాలు తీస్తారు. కానీ తెలుగు ఇండస్ట్రీలోని దర్శకులు అలా కాదు. తమ హీరో బాగుండాలి, తమ సినిమా బాగుండాలని తీస్తారు.
 
 అందుకే ఇంతమంది హీరోలం ఇక్కడున్నాం. సురేందర్‌రెడ్డి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను’’అని అల్లు అర్జున్ చెప్పారు. రేసుగుర్రాలు పనిచేసిన సినిమా ఇది. విజయం తథ్యం అని సురేందర్‌రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘చిరంజీవిగారితో చక్రవర్తి, రౌడీఅల్లుడు, అన్నయ్య చిత్రాలను నిర్మించాను. మూడూ విజయవంతమైన సినిమాలే. 11ఏళ్ల విరామం తర్వాత నేను నిర్మిస్తున్న చిత్రమిది. మళ్లీ ఒక మంచి సినిమాను నిర్మిస్తున్నందుకు  చాలా ఆనందంగా ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన కె.వెంకటేశ్వరరావు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు అల్లు అరవింద్, బి.గోపాల్, అలీ, కె.ఎల్.నారాయణ, సి.కల్యాణ్, పైడిపల్లి వంశీ, ఎన్వీ ప్రసాద్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, మారుతి, జెమినీ కిరణ్, ఎం.ఎల్.కుమార్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement