కత్తి రీమేక్‌కు కొత్త చిక్కు | Sakshi
Sakshi News home page

కత్తి రీమేక్‌కు కొత్త చిక్కు

Published Wed, Jan 27 2016 11:21 PM

కత్తి రీమేక్‌కు కొత్త చిక్కు - Sakshi

చిరంజీవి 151వ చిత్రంగా తమిళ ‘ కత్తి ’తని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు తెలిసిందే. మొదలుకాకముందే ఈ రీమేక్ వివాదాస్పదమైంది. ‘కత్తి’ కథ తనదేనని దర్శక, రచయిత నరసింహారావు రైటర్స్ అసోసియేషన్, డెరైక్టర్స్ అసోసియేషన్ ద్వారా ఎప్పటి నుంచో చేస్తున్న పోరాటం మళ్ళీ తెర మీదకు వచ్చింది. వివరాల్లోకెళితే దర్శక,రచయిత నరసింహారావు 2006లోనే ‘కత్తి’ కథను ‘యాగం’ పేరిట ‘తెలుగు సినిమా రచయితల సంఘం’లో రిజిస్టర్ చేశారు.
 
  సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ ఈ కథతో ఆయనకు దర్శకుడిగా చాన్సిస్తూ, తమిళంలో విజయ్‌తో సినిమా మొదలుపెట్టి, అర్ధంతరంగా ఆపేసింది. ఆ తర్వాత మురుగుదాస్ స్వల్ప మార్పులతో ఇదే కథను ‘కత్తి’గా రూపొందించి, విజయం సాధించారు. తమిళ ‘కత్తి’ రిలీజైన రెండు రోజులకి తన కథ కాపీ అయిన విషయం తెలిసిన నరసింహారావు వెంటనే ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’కి ఫిర్యాదు చేశారు. మురుగదాస్ వద్ద ‘తుపాకి’ తెలుగు వెర్షన్‌కూ, శంకర్ ‘అపరిచితుడు, శివాజీ’ చిత్రాలకూ పనిచేసిన నరసింహారావు అప్పటి నుంచి తనకు న్యాయం చేయాలని పోరాడుతూనే ఉన్నారు.
 
  రచయితల సంఘంలోని ‘కథా హక్కుల వేదిక’ పక్షాన 12 మంది సీనియర్ రచయితలు, దర్శకులు సైతం తమిళ ‘కత్తి’నీ, రిజిస్టరైన కథనూ పరిశీలించి, ఆ కథే సినిమాగా రూపొందినట్లు ధ్రువీకరించారు. కథారచయితగా పేరు, పరిహారం ఇప్పించి, సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి అప్పటి నుంచి దర్శకుల, రచయితల సంఘాలు ప్రయత్నిస్తూ వచ్చాయి. న్యాయం చేస్తామన్న చాంబర్ పెద్దలూ ఎందుకనో ముందుకు రాలేదు.
 
  దాంతో, ఇప్పుడు తెలుగులోకి కథ రీమేక్ అవుతుండడంతో నరసింహారావుకి న్యాయం జరిగేవరకూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయరాదని రచయితల, దర్శకుల సంఘం తీర్మానించింది. ఒకవేళ తీర్మానాన్ని ఉల్లంఘించి, నిర్మాణాన్ని చేపడితే, 24 క్రాఫ్ట్‌ల కార్మికులు ఈ చిత్రానికి సహకరించరాదంటూ తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్యకు తాజాగా లేఖ రాసింది.
 
 వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించనున్న ‘కత్తి’ రీమేక్ మార్చిలో మొదలుకావాలి. ‘‘సినిమా ఆపడం నా అభిమతం కాదు. తమిళ నిర్మాతలు చేసిన మోసం బయటకొచ్చి, రచయితగా నాకు న్యాయం జరగాలనే నా బాధంతా’’ అని 20 ఏళ్లుగా సినీరంగంలో పనిచేస్తున్న నరసింహారావు ‘సాక్షి’తో అన్నారు. ఇటీవలే మొదలైన ‘శరభ’ చిత్రంతో దర్శకుడిగా శ్రీకారం చుడుతున్న ఈ సీనియర్ టెక్నీషియన్‌కు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా? ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియాలంటే కొంత కాలం ఆగాలి.
 

Advertisement
Advertisement