ఆల్‌రౌండర్ గురూ..! | Sakshi
Sakshi News home page

ఆల్‌రౌండర్ గురూ..!

Published Wed, Aug 20 2014 12:30 AM

ఆల్‌రౌండర్ గురూ..!

రేలంగిని చూస్తే చాలు... పొట్ట చెక్కలే!

కస్తూరి శివరావు, రమణారెడ్డి, బాలకృష్ణ, చదలవాడ, రాజబాబులాంటి వాళ్లను చూస్తే కూడా పెదవులపై నవ్వుల వరదలే! అవును మరి... వాళ్ల ఫేస్‌లు, బాడీ లాంగ్వేజ్‌ల మాన్యుపాక్చరింగ్‌లోనే చిన్న కామెడీ టింజ్ ఉంది. మరి పద్మనాభం ఫేస్ చూస్తేనేమో... చాలా నార్మల్. ఇక కామెడీ ఎలా పుడుతుంది? కానీ పుట్టించాడాయన. తన పాత్రలతోనే తెగ కామెడీ సృష్టించాడు. కామెడీకే ‘గురూ’ అయిపోయాడు. ‘పాతాళ భైరవి’తో ‘గురూ’ ఊతపదాన్ని తెలుగునాట తెగ పాపులర్ చేసింది ఇతగాడేగా!

పద్మనాభం హాస్యంలో సామాన్యుడి గుండెచప్పుడు వినబడుతుంది. అందుకే మాస్ అంతా ఆయనతో తెగ కనెక్టయిపోయారు. ఇది మామూలు కనెక్టివిటీ కాదు. ఓ 15-20 ఏళ్లు పద్మనాభందే హవా! ప్రేక్షకులు ఆయన నవ్వినా నవ్వారు. ఏడ్చినా నవ్వారు. కూర్చున్నా నవ్వారు. నిలబడ్డా నవ్వారు. కమెడియన్‌గా ఓ రాజభోగం అనుభవించాడాయన. అదో పెద్ద హిస్టరీ. కానీ ఆయన్ను కేవలం కమెడియన్ యాంగిల్లోనే చూడాలంటారా?! ఎందుకంటే - ఆయనలో కథానాయకుడున్నాడు. గాయకుడున్నాడు. నిర్మాత ఉన్నాడు. దర్శకుడున్నాడు. వీటన్నింటినీ మించి గొప్ప రంగస్థల కళాకారుడున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే...  పద్మనాభం ఆల్‌రౌండర్.
 
రంగస్థలంపై అదుర్స్!: పద్మనాభం అనబడే బసవరాజు వెంకట పద్మనాభరావుది కడప జిల్లా సింహాద్రిపురం. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా చిన్నప్పటినుంచీ పద్మనాభం అనుకరణలో దిట్ట. పద్యాలు పాడటంలో మేటి. తన ఆరో ఏటే ‘చింతామణి’ నాటకంలో బాలకృష్ణుడిగా చేసి అదరగొట్టాడు. అప్పటి నుంచి లాస్ట్ స్టేజ్ వరకూ స్టేజ్ మీద 2500 పై చిలుకు నాటకాల్లో నటించాడు. ‘చింతామణి’ నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర చేయడంలో అప్పట్లో పద్మనాభం ఫేమస్.
 
కొంచెం ట్రై చేసుంటే: పద్మనాభంది హీరో మెటీరియల్ కాకపోయినా, అంత తీసిపారేయదగ వాడేం కాదు. అందుకేనేమో ప్రసిద్ధ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ‘‘నిన్ను హీరోని చేస్తా’’నని ప్రామిస్ చేశారు. కానీ అది జరగలేదు. వాళ్లనీ వీళ్లనీ అనుకరిస్తూ కవ్విస్తూ నవ్విస్తూ ఉండే పద్మనాభంలో అందరికీ కమెడియన్నే కనిపించాడు. ఆయన ఏమాత్రం కొంచెం ట్రై చేసినా హీరో అయ్యేవాడేమో! ఆర్టిస్టుగా ఓ స్థాయికెదిగాక, నిర్మాత అయ్యాక పద్మనాభం హీరోగా కొన్ని సినిమాలు చేశారు. కొన్ని కొన్ని సినిమాలు ఆయనకు టైలర్ మేడ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్... ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’.
 
లక్షల్లోనుంచి వేలల్లోకి: సినిమా తీయడం ఇప్పుడెంత కష్టమో, ఆ రోజుల్లోనూ అంతే కష్టం. పద్మనాభం బాగా సంపాదించాడు. కమెడియన్‌గా స్టార్ రేంజ్. కానీ ఏదో అసంతృప్తి. తన మనసుకి నచ్చే సినిమాలు తీయాలి. అలా పుట్టిందే ‘రేఖ అండ్ మురళి ప్రొడక్షన్స్’. ఫస్ట్ సినిమా ‘దేవత’. ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ ఫలితం. సూపర్‌హిట్. ఆ తర్వాత పద్మనాభం తొమ్మిది సినిమాలు తీశారు. అన్నీ కంటెంట్ ఓరియెంటెడే. సక్సెస్, ఫెయిల్యూర్ పక్కన పెడితే ఒక్కదాన్ని మించి ఒకటి. కానీ ఫెయిల్యూర్‌కి దాహమెక్కువ. డబ్బులు తాగుతూనే ఉంటుంది. అందుకేనేమో లక్షలు సంపాదించుకున్నవాడు కాస్తా వేలల్లోకి దిగిపోయారు. కానీ నిర్మాతగా కీర్తి మాత్రం మిగిలింది. ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’తో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ఈ ప్రపంచానికి గాయకునిగా పరిచయం చేసిన ఘనత ఒక్కటి చాలదూ!
 
అనుకోకుండా డెరైక్షన్: కమెడియన్ అవుతానని పద్మనాభం ఎప్పుడు కల కూడా కనలేదట. డైరక్షన్ కూడా అంతే. అంతా యాదృచ్ఛికమే. ‘శ్రీరామ కథ’ సినిమా తీద్దామనుకుని స్క్రిప్ట్ చేసుకున్నారు. అప్పటికి డెరైక్టర్‌గా ఎవర్నీ అనుకోలేదు. ఫైనల్‌గా తానే చేద్దామని డిసైడయ్యారు. ఆ తర్వాత ‘ఆజన్మ బ్రహ్మచారి’, ‘జాతకరత్న మిడతం భొట్లు’, ‘గుండా జోయిస’ (కన్నడం), ‘మాంగల్య భాగ్యం’, ‘పెళ్లి కాని తండ్రి’ ‘కథానాయిక మొల్ల’, ‘మా ఇంటి దేవత’ సినిమాలు డెరైక్ట్ చేశారు. పద్మనాభం తీసిన సినిమాల్లో పాటలూ బాగుంటాయి. ప్రయోగాలు బాగుంటాయి. ‘కథానాయిక మొల్ల’లో ఎల్లారీశ్వరితో తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో పదకొండున్నర నిమిషాల పాట పాడించారు. ‘మాంగల్య భాగ్యం’లో భానుమతితో ఇంగ్లీషు పాట పాడించారు.
 
సూపర్‌స్టార్ కృష్ణకు ప్లేబ్యాక్: పద్మనాభంలో మంచి సింగర్ కూడా ఉన్నాడు. తొలినాళ్లలో బృందగానాల్లో పాలు పంచుకున్న అనుభవం ఉందాయనకు. సినిమా ఫీల్డ్‌లో ఆయన కెరీర్ కోరస్ సింగర్‌గానే మొదలైంది కూడా. నటి కన్నాంబ నిర్మించిన ‘పాదుకా పట్టాభిషేకం’లో ‘పడవెళ్లి పోతోంది...’ పాటలో ‘హైలేసా హైలేసా’ అంటూ కోరస్ పాడారు. ‘దేవత’లో ఆయన పాడిన ‘మావూరు మదరాసు నా పేరు రాందాసు’ పాట అయితే ఎవర్‌గ్రీన్ హిట్. ‘తేనె మనసులు’ కోసం సూపర్‌స్టార్ కృష్ణకు ‘వన్ టూ త్రీ’ పాటలో ప్లేబ్యాక్ కూడా పాడారు. 1995లో హెచ్.ఎం.వి. సంస్థ అయితే పద్మనాభం పాడిన ‘సుందరకాండ’ హరికథా రూపాన్ని ప్రైవేట్ ఆడియోగా విడుదల చేసింది.
- పులగం చిన్నారాయణ

Advertisement
Advertisement