ఖాకీ వేస్తే పోలీస్‌... తీస్తే రౌడీ

24 Oct, 2019 02:50 IST|Sakshi
సల్మాన్‌ ఖాన్‌

‘‘ప్రతి సినిమా విజయం సాధించాలనే కష్టపడి చేస్తాం. ఆ ఒత్తిడి మాపై ఉంటుంది. కానీ ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటేనే విజయం దక్కుతుంది. మేం స్టార్స్‌ కావడానికి వారి ఆశీర్వాదమే కారణం’’ అని సల్మాన్‌ ఖాన్‌ అన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్‌ హీరోగా ‘దబాంగ్‌’ సిరీస్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దబాంగ్‌ 3’. సోనాక్షీ సిన్హా హీరోయిన్‌గా నటించారు. అర్బాజ్‌ఖాన్, నిఖిల్‌ ద్వివేది, సల్మాన్‌ఖాన్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ హిందీ, కన్నడ భాషల్లో డిసెంబరు 20న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘ఖాకీ వేస్తే పోలీస్‌.. తీస్తే రౌడీ.. టోటల్‌గా ఆల్‌ రౌండర్ని’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్‌ కిక్‌ ఇచ్చేలా ఉంది.

ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభిమానులు, విలేకరులతో ‘దబాంగ్‌ 3’ కీలక చిత్రబృందం మాట్లాడారు. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌ మాట్లాడుతూ– ‘‘ఇది క్లాస్‌ మాస్‌ ఫిల్మ్‌. సౌత్‌ సినిమా ఫార్మాట్‌కు దగ్గరగా ఉంటుంది. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో నేను చేసిన ‘వాంటెడ్‌’ తెలుగు ‘పోకిరి’ చిత్రానికి రీమేక్‌. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’ చిత్రాలకు బాలీవుడ్‌లో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం సౌత్‌ సినిమాలు హిందీలో అనువాదం అవుతున్నాయి. అందరూ చూస్తున్నారు. హిట్‌ సినిమాలను రీమేక్‌ చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌కు వస్తాను’’ అన్నారు. ప్రభుదేవా ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్‌ను కలిసే ప్రయత్నం చేస్తా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సల్మాన్‌. ‘‘దబాంగ్‌ 3’పై ఏర్పడ్డ అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు ప్రభుదేవా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా