Sakshi News home page

ధూమ్ 3 టార్గెట్...1000 కోట్లు!

Published Wed, Dec 11 2013 6:29 AM

ధూమ్ 3 టార్గెట్...1000 కోట్లు! - Sakshi

వంద కోట్లు చాలా పాత విషయం
200 వందల కోట్లు నిన్న మొన్నటి టాపిక్.
300 కోట్లు లేటెస్ట్ ట్రెండ్.
400 వందల కోట్లు షాకింగ్ న్యూస్
మరి 1000 కోట్లు షాకింగ్ కే షాకింగ్ న్యూస్
 
అవును... ఈ మధ్య బాలీవుడ్ అంతా ఈ మేజిక్ ఫిగర్‌ల మీదే నడుస్తోంది. చిన్న చిన్న స్టార్ వేల్యూ ఉన్న సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్‌కి గురిపెడుతుంటే, ఇక సూపర్‌స్టార్ల సిని మాలపై అంచనాలకు హద్దేముంటుంది?  ఇప్పటివరకూ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ 422 కోట్ల రూపాయలు వసూలు చేసి బాలీవుడ్ హిస్టరీలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ‘3 ఇడియెట్స్’ 393 కోట్లు, ‘క్రిష్ 3’ 374, ‘ఏక్తా టైగర్’ 319, ‘యే జవానీ హై దీవానీ’ 309 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే 2013లో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన చిత్రంగా ‘క్రిష్ 3’ నిలుస్తుందని నిర్మాత రాకేశ్ రోషన్, ట్రేడ్ అనలిస్టులు వేసిన అంచనాలు మాత్రం తలకిందులయ్యాయి.  ‘క్రిష్ 3’ చిత్రం విడుదలకు ముందు జరిగిన ఓ మీడియా సమావేశంలో తమ చిత్రం వెయ్యికోట్లు వసూలు చేస్తుందని రాకేశ్ రోషన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, కథనంలో వేగం మందగించడం, సాంకేతికంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినా ‘క్రిష్ 3’ 374 కోట్ల రూపాయలు వసూలు చేయడం మాత్రం సినీ విమర్శకుల్ని సైతం ఆశ్చర్యానికి లోను చేసింది. 
 
 ప్రస్తుతం సినీ ట్రేడ్ అనలిస్టులు, విమర్శకులు, ప్రముఖుల దృష్టంతా ‘ధూమ్ 3’ చిత్రంపైనే ఉంది. ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్‌లాంటి హేమాహేమీలు ఇందులో నటించారు. విడుదలకు ముందే ఈ చిత్రం సృష్టిస్తున్న హంగామా అందరిలోనూ అంచనాలు పెంచుతోంది.  డిజిటల్ రీ మాస్టరింగ్, డాల్బీ ఆట్మోస్ టెక్నాలజీతో, ఐమాక్స్ ఫార్మాట్ లాంటి ప్రత్యేకతలతో విడుదలవుతున్న తొలి చిత్రంగా ‘ధూమ్ 3’ ఓ ప్రత్యేకతను సంతరించుకోవడమే కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన హిందీ సినిమాగా రికార్డుకెక్కింది. 
 
 కేవలం ‘మలాంగ్’ అనే పాటకే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటేనే ఆ సినిమా మేకింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనేక ప్రత్యేకతలు కలిగిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కేవలం హిట్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా 500 కోట్ల ఫిగర్‌ను అవలీలగా దాటేస్తుందని, టాక్ రేంజ్ పెరిగితే 1000 కోట్ల మార్కు చేరడం అంత కష్టమేమీ కాదని బాలీవుడ్ పండితుల అంచనా. దానికి తగ్గట్టుగానే ఆ చిత్ర నిర్మాతలు ఓవర్‌సీస్ మార్కెట్‌ని, ప్రాంతీయ భాషల మార్కెట్‌ని కొల్లగొట్టడానికి పలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అనువదించారు. ఒకవేళ ‘ధూమ్ 3’ మాత్రం 1000 కోట్ల రూపాయలు టార్గెట్‌ని సాధిస్తే... ప్రపంచ సినీచరిత్రలోనే ఒక స్పెషల్ ఇండియన్ మూవీగా నిలిచిపోవడం ఖాయం.
-రాజబాబు అనుముల

Advertisement

What’s your opinion

Advertisement