నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే | Sakshi
Sakshi News home page

నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే

Published Thu, Jan 9 2020 12:12 AM

Director Anil Ravipudi Interview About Sarileru Neekevvaru Movie - Sakshi

‘‘మనం చేసే పని నచ్చేవారు వందలో అరవై నుంచి డెబ్బై మంది మాత్రమే ఉంటారు. ముప్పై మంది మనం ఏం తీసినా తిడతారు. అందుకే 70 మంది కోసమే సినిమా తీయాలి. నా సినిమాల కథలను ఏ కొందరో విమర్శించారని నేను పక్కకు పోయి ఓ ప్రయోగాత్మక సినిమా తీస్తే... అదేంటీ అనిల్‌ రావిపూడి అతని బలమైన జానర్‌ను వదిలేసి ఇలాంటి సినిమా తీశాడు? అనే వార్తలు వస్తాయి. నేను చేసిన ప్రతి సినిమా ఆ హీరోల కెరీర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ ఫిలింసే’’ అన్నారు అనిల్‌ రావిపూడి. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు సమర్పణలో అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతున్న సందర్భంగా అనిల్‌ రావిపూడి చెప్పిన విశేషాలు.

► ‘సుప్రీమ్‌’ సినిమా కోసం జోధ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక సైనికుడిని కలిశాను. ఆయనతో మాట్లాడినప్పుడు సైనికులు ఏయే పరిస్థితుల్లో ఎలా ఉంటారో తెలుసుకున్నాను. ఆ సంఘటనల నుంచి ప్రేరణ పొంది ‘సరిలేరు నీకెవ్వరు’ కథ రాసుకున్నాను. ‘ఎఫ్‌ 2’ సినిమా సమయంలో మహేశ్‌బాబుగారికి ఈ కథ చెప్పాను. క్యారెక్టరైజేషన్‌ బాగా నచ్చి, నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాను మహేశ్‌గారి నమ్మకానికి నేను ఇచ్చే బహుమతిగా భావిస్తున్నా.

మహేశ్‌గారి టైమింగ్‌ బాగుంటుంది. దర్శకులకు ఆయన పూర్తి స్వేచ్చ ఇస్తారు. దర్శకులకు కావాల్సింది వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. మహేశ్‌గారికి నేను కాదు.. ఆయన నా కెరీర్‌కు ప్లస్‌. విజయశాంతిగారు మొదట్లో చేయనన్నారు. ఒకసారి కథ వినమన్నాను. కథ విన్నాక  భారతి పాత్ర చేయడానికి ఆమె ఒప్పుకున్నారు.  ఆమె కోసమే ఈ పాత్ర రాశాను. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన పాటల పట్ల దర్శకుడిగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను. నిర్మాతలు ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకరగారు సహకరించారు.
     
► దేశభక్తి, వినోదం అనే అంశాలను ఒకేసారి డీల్‌ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. కానీ దాన్నే హీరోగారి చేత ఎంటర్‌టైనింగ్‌గా ఎలా చెప్పించాం అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. బోర్డర్‌ నుంచి అజయ్‌కృష్ణ (మహేశ్‌ పాత్ర పేరు) అనే ఆర్మీ ఆఫీసర్‌ ఓ బాధ్యతతో కర్నూలు వస్తాడు. ఒక యుద్ధ వాతావరణం నుంచి సాధారణ ప్రజల మధ్యలోకి వచ్చిన అతనికి ప్రజలు అమాయకులుగా కనిపిస్తారు. ఎందుకంటే సరిహద్దుల్లో శత్రువులు వేరు, సమాజంలోని శత్రువులు వేరు. వీరందరూ బాధ్యతతో ఉండాలనేది అజయ్‌కృష్ణ వ్యక్తిత్వం. యుద్ధంలో శత్రువును చంపడం కాదు. శత్రువును మార్చడం ముఖ్యమని మా సినిమా చెబుతుంది. ఇందులో వచ్చే ఆర్మీ ఎపిసోడ్‌ చాలా కీలకం. క్లైమాక్స్‌ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి.  
   
► ప్రస్తుతం నా సినిమా ప్రయాణం బాగానే సాగుతోంది. అయితే నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే. ‘పటాస్‌’ సినిమాతో దర్శకుడిగా కల్యాణ్‌రామ్‌గారు అవకాశం ఇచ్చారు. ‘సుప్రీమ్‌’తో సాయిధరమ్‌ తేజ్, ‘రాజా ది గ్రేట్‌’కి రవితేజగారు, ‘ఎఫ్‌ 2’కి వెంకటేష్, వరుణ్‌తేజ్‌ గార్లు వీరందరు నన్ను ఇంతదూరం తీసుకువచ్చారు. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేశ్‌గారితో సినిమా చేశాను కాబట్టి నేను ఏదో గొప్ప అని ఊహించుకోవడం లేదు. నేను వచ్చిన దారి నాకు గుర్తు ఉంది.
     
► ఏ దర్శకుడికైనా అతని ప్రయాణంలో ఏదో సందర్భంలో ఫ్లాప్‌ వస్తుంది. మనకు తెలియకుండానే ఆ తప్పు జరిగిపోతుంది. కానీ ఆ తప్పుని ఎంత దూరంలో జరుపుకుంటామనేది మన చేతుల్లో ఉంటుంది. ఆ తప్పు తొందరగా జరగకూడదని ప్రయత్నిస్తున్నాను. నేను తీసిన ప్రతి సినిమా సూపర్‌హిట్‌ అవుతుందని నేను చెప్పలేను.
     
► చిరంజీవిగారితో సినిమా చేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తా. బాలకృష్ణగారితో సినిమా చేయాల్సింది. కుదర్లేదు. భవిష్యత్‌లో ఉండొచ్చు. ‘ఎఫ్‌ 2’ సీక్వెల్‌ ఆలోచన ఉంది. ప్రస్తతానికి నా తర్వాతి చిత్రం గురించి ఇంకా ఏమీ అనుకోలేదు.   

Advertisement
Advertisement