అనుకోకుండా వచ్చా... | Sakshi
Sakshi News home page

అనుకోకుండా వచ్చా...

Published Mon, Feb 9 2015 11:34 AM

అనుకోకుండా వచ్చా...

* హైదరాబాద్‌లో కూలి పని చేశా
* ఇప్పటికి నాలుగు సినిమాలు చేశా
* త్వరలో బ్రహ్మనందం హీరోగా సినిమా
* కొలిమి సినిమా డైరెక్టర్ నాగేంద్ర

 
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ కాగా... ఇంట్లో నాన్న కోపం చేయడంతో... పారిపోయి హైదరాబాద్‌కు వెళ్లిన వ్యక్తి.. కూలి పనులు చేసి కాలం వెళ్లదీశాడు.. అనుకోకుండా వచ్చిన అవకాశంతో ఓ టీవీ చానల్‌లో పనికి కుదిరాడు.. అక్కడి నుంచి సినిమారంగంలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.. అంతేకాదు డెరైక్టర్‌గా మారి నాలుగు చిత్రాలు రూపొందించారు.. ఇదంతా చదివితే ఓ సినిమా కథలా అనిపిస్తోంది కదూ.. కానీ ఇది కొలిమి సినిమా డైరెక్టర్ గోలి నాగేంద్ర జీవిత గాథ.. జిల్లాకు చెందిన ఆయన ప్రస్థానమే ఇదంతా. వరంగల్‌లోని నటరాజ్ సినిమా థియేటర్‌లో కొలిమి సినిమా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఆదివారం థియేటర్‌కు వచ్చిన ఆయనను ‘సాక్షి’ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
- పోచమ్మమైదాన్
 
మాది ములుగు మండలం పాల్సావ్‌పల్లి గ్రామం... అవి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే రోజులు. రిజల్ట్స్ చూసుకుంటే ఫెయిల్ అయ్యానని తెలిసింది. దీంతో నాన్న కోపం చేశారు. ఇంట్లో పెద్ద గొడవైంది. ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్ వెళ్లాను. ఏం చేయాలో తోచలేదు. అక్కడ కూలి అడ్డా ఎక్కడ ఉందో తెలుసుకున్నాను. అక్కడకు వెళ్లిన మరుసటి రోజు అడ్డా దగ్గర నిలబడితే ఉప్పరి పనికి తీసుకవెళ్లారు. అప్పుడు కూలి రూ.30 ఇచ్చారు. రాత్రి ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితి. నాతో పాటు కూలికి వచ్చిన వ్యక్తితో  పరిచయం ఏర్పడింది. వాళ్లు ఉండే గుడిసెలో నేను కూడా ఉన్నాను. నాలాంటి కష్టం నా పగ వారు కూడా పడవద్దు అనే విధంగా కష్టపడ్డాను.
 
 అదే.. టర్నింగ్ పాయింట్
 ఉప్పరి పని నచ్చలేదు. బోరింగ్ వేసే మోటర్ పని చేస్తే వాళ్లే రూం ఇస్తారు... భోజనం కూడా దొరుకుతుందని తెలిసింది. వెంటనే ఆ పనిలో చేరాను. ఒక రోజు జెమిని టీవీలో బోర్ వేసేందుకు వెళ్లాం. అప్పుడు అక్కడ ఉన్న ప్రోగ్రాం డెరైక్టర్ తోటకూర రఘు పరిచయమయ్యారు. రఘు సార్ దగ్గరికి వెళ్లి ఈ పని చేయలేకపోతున్నా.. మీ టీవిలో ఏమైనా పని ఉంటే చెప్పండి సార్ అంటూ మూడు నెలల పాటు తిరిగాను. అలా ఆయన వద్ద అసిస్టెంట్‌గా జాబ్‌లో చేరగా, నెలకు రూ.850 ఇచ్చేవారు. వరంగల్ నుంచి వచ్చిన తర్వాత మూడేళ్లకు ఇంటికి వెళ్లాను.
 
 అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశం..
 అలా సాగుతున్న సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ్ పరిచయమయ్యారు. మా బాబు సీరియల్‌కు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశాను. ఆ తర్వాత కోడి రామకృష్ణ దగ్గర పెళ్లి, కృష్ణవంశీ దగ్గర  చంద్రలేఖ, అంతఃపురం, బాబ్జీ దగ్గర ఎన్‌టీఆర్ నగర్.. ఇలా సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశాను. ఎంత కష్టం వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగాను.
 
 ప్రత్యూష సినిమాతో...
 తెలంగాణ ఆర్టిస్ట్‌లు, డెరైక్టర్లు అంటే సినిమా రంగంలో కొంత చిన్న చూపు వాస్తవమే. తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోయిన్ ప్రత్యూష  మృతి చెందిన సంఘటనను నేపథ్యంగా తీసుకుని నిర్మించిన సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించాను. ప్రత్యూషకు జరిగిన అన్యాయాన్ని సినిమాలో చూపించాను. ప్రత్యూష ఆత్మకు శాంతి చేకూరాలని, సినిమా ఇండ్రస్ట్రీలో తెలంగాణ వారికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ప్రేక్షకులకు తెలియాలని తీశాం. అప్పటి నుంచి నన్ను ప్రత్యూష నాగేంద్ర అని పిలిచేవారు. గుంటూరులో ఫ్యాక్షనిజంపై సర్దార్ చిన్నపురెడ్డి సినిమా తీశాను. రైతు తలుచుకుంటే లక్షల మందికి అన్నం పెడుతాడు అనే సందేశంతో దీనిని నిర్మించా. ఆ తర్వాత వెంకటేశ్వర్ రావు బీఏ బీఈడీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు లభించక నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను తెలియజేశా.  
 
 ఇప్పుడు కొలిమి...
 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 2001 నుంచి 2012 వరకు జరిగిన సంఘటనలు, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి నేపథ్యంగా కొలిమి సినిమాను తీర్చిదిద్దా. ఈ సినిమాకు తెలంగాణ భవనలో కేసీఆర్ క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో యువతర తెలంగాణ..., వందేమాతరమా పాటలను స్వయంగా ఆయనే ఎంపిక చేశారు. కొలిమి సినిమాలో తెలంగాణ ఉద్యమ సంఘటనలను పూర్తిగా చేర్చాను. మొత్తం 63 థియేటర్లలో సినిమా విడుదలైంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నా.
 
 త్వరలో రబ్బర్‌సింగ్
 వంద శాతం కామెడీ ఉండే విధంగా రబ్బర్ సింగ్ సినిమాను రూపొం దిస్తున్నా. ఈ సినిమాలో హీరోగా బ్రహ్మానందం నటించనున్నారు. ఈ నెల 20వ తేదీన రామానాయుడు స్టూడియోలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. వరంగల్‌కు చెందిన చాలా మందికి నా చిత్రాల్లో అవకాశం ఇచ్చాను. తదుపరి నేను తీయనున్న చిత్రాల్లోనూ తప్పకుండా అవకాశాలు ఇస్తా.
 
 డేర్ చేయాలి..
 సినిమా రంగంలో రాణించాలనుకునే వారు మొదట డేర్ చేయాలి. సినిమా ఇండస్ట్రీలో రాణించాలనుకునే వారు సినిమాలో ఏ అవకాశం వచ్చినా వదులుకోకూడదు. లైట్‌మన్‌గా అవకాశం వచ్చినా ఆ పని చేయాలి. ఆ తరువాత పరిచయాల ద్వారా సినిమా రంగంలో పూర్తి స్థాయిలో వెళ్లవచ్చు. పట్టుదలతో ముందుకు సాగితే సినిమా రంగంలో తప్పక విజయం సాధించవచ్చు. టాలెంట్ ఉన్న వారికి తప్పకుండా లైఫ్ లభిస్తుంది. నేను మాత్రం అనుకోకుండా వచ్చి దర్శకుడిగా ఎదిగాను.

Advertisement

తప్పక చదవండి

Advertisement