అమెరికాలోనూ మారుతి మేజిక్! | Sakshi
Sakshi News home page

అమెరికాలోనూ మారుతి మేజిక్!

Published Sat, Sep 12 2015 12:12 AM

అమెరికాలోనూ మారుతి మేజిక్! - Sakshi

ఒక మతిమరుపు కుర్రాడిని తెరపై చూసి ఎవరైనా భలే మగాడు అంటారా? కానీ మారుతి తన మేజిక్‌తో అది సాధ్యమే అని నిరూపించాడు. ఈ మతిమరపు కథను ఇప్పుడు పరిశ్రమ ‘అన్‌ఫర్గెటబుల్ హిట్’గా కీర్తిస్తోంది. ఇంటా బయటా ఎక్కడ చూసినా ‘భలే భలే మగాడివోయ్’ ప్రభంజనమే. మారుతి దర్శకత్వంలో నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రమిది. యు.వి. క్రియేషన్స్, జిఏ2 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మాత. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

అమెరికాలో అయితే ఏకంగా మిలియన్ డాలర్ల మార్క్‌ని అధిగమించి దర్శకుడు మారుతిని త్రివిక్రమ్, శ్రీను వైట్ల, రాజమౌళి, కొరటాల శివల సరసన చేర్చింది. నానిని కూడా అగ్ర కథానాయకుల జాబితాలోకి తీసుకెళ్లిందీ సినిమా.
 
సాధారణంగా ఓవర్సీస్ ప్రేక్షకులు కామెడీని బాగా ఇష్టపడుతుంటారు. శ్రీను వైట్ల, త్రివిక్రమ్ లాంటి దర్శకుల చిత్రాలు అమెరికాలో వసూళ్లు ఇరగదీస్తుంటాయంటే వాళ్ల సినిమాల్లోని కామెడీనే కారణం. ఆ తరహాలో ఈసారి మారుతి అదరగొట్టాడు. స్వచ్ఛమైన వినోదంతో సినిమా తీశాడు. చాలారోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వించే సినిమా వచ్చిందంటూ ‘భలే భలే మగాడివోయ్’కి అమెరికాలో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోలాగే విడుదలైన తొలిరోజే అమెరికాలో పాజిటివ్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది.
 
లాభాలే లాభాలు...
అప్పట్లో ప్రచారం కాలేదు కానీ, మారుతి తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ని అమెరికాలో రెండు లక్షల రూపాయలకు కొని విడుదల చేస్తే ఏకంగా 25 లక్షల వసూళ్లొచ్చాయి. అంటే డిస్ట్రిబ్యూటర్‌కి ఏ రేంజ్ లాభాలో ఊహించొచ్చు. అలాగే ‘ప్రేమకథా చిత్రమ్’ రూ.5 లక్షలకి అమ్ముడైంది. కాని ఇక్కడ ఆ సినిమాకి రూ.75 లక్షల వసూళ్లొచ్చాయి. ఇటీవల ‘భలే భలే మగాడివోయ్’ సినిమాని అమెరికాలో రూ.55 లక్షలకు అమ్మారు నిర్మాతలు. కానీ ఆ సినిమా ఏకంగా మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఈరకంగా చూస్తే ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్‌లో మారుతి ఓ సరికొత్త ట్రెండ్‌ని సృష్టించినట్టే. అమెరికాలోనే కాదు... నైజామ్, ఆంధ్రా, సీడెడ్‌లలోనూ ‘భలేభలే మగాడివోయ్’కి థియేటర్లు పెరుగుతూనే ఉన్నాయి.
 
ఇక మంచి సినిమాలే...
దర్శకుడు మారుతి ఇదివరకు తీసిన సినిమాల్లో కూడా వినోదం చాలానే ఉంది. కాని దాంతో పోలిస్తే ‘భలే భలే మగాడివోయ్’లోని వినోదం విభిన్నమైనది. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల నుంచి స్పందనొచ్చింది. మారుతి కామెడీ శైలిని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ స్పందనని చూసి మారుతి కూడా మరింతగా స్ఫూర్తి పొందుతున్నాడు. ‘‘మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న విషయం మరోసారి తెలుగు ప్రేక్షకులు రుజువు చేశారు. ఇకపై ఇలాంటి స్వచ్ఛమైన సినిమాలే తీస్తా. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులతోపాటు అమెరికాలో ఉన్న తెలుగు ప్రేక్షకులకూ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు’’ అంటున్నాడు మారుతి.
 
నాని టైమింగ్ అదుర్స్
‘భలే భలే మగాడివోయ్’ కథని నాని తన టైమింగ్‌తో మరో స్థాయికి తీసుకెళ్లాడు. లక్కీ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించాడు. లావణ్యతోనూ మంచి కెమిస్ట్రీ పండించాడు. అందుకే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాని టైమింగ్ గురించీ, లావణ్య త్రిపాఠి అందం గురించి మాట్లాడుతున్నారు. ‘ఇది ఊహించని విజయం’ అంటున్నాడాయన. ‘సినిమా సక్సెస్ సాధిస్తుందని తెలుసు. కానీ ఈ స్థాయిలో సక్సెస్‌ని మాత్రం అస్సలు ఊహించలేదు. ఓవర్సీస్‌లో ప్రేక్షకుల ఆదరణని నిజంగా ఎప్పటికీ మరచిపోలేను’ అని చెప్పుకొచ్చాడు నాని.

Advertisement
Advertisement