న్యాయం చేయమంటే బెదిరిస్తున్నారు | Sakshi
Sakshi News home page

న్యాయం చేయమంటే బెదిరిస్తున్నారు

Published Tue, Feb 21 2017 8:43 AM

న్యాయం చేయమంటే బెదిరిస్తున్నారు - Sakshi

‘‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులను కొని, నష్టపోయా. పవన్‌ కల్యాణ్‌ తర్వాతి చిత్రం ‘కాటమరాయుడు’ పంపిణీ హక్కులు ఇస్తామని చెప్పిన నిర్మాత శరత్‌ మరార్, పవన్‌ కల్యాణ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ ఇప్పుడు స్పందించక పోగా, బెదిరిస్తున్నారు’’ అని డిస్ట్రిబ్యూటర్‌ సంపత్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను పవన్‌ కల్యాణ్‌గారి అభిమాని. చిన్న సినిమాలు పంపిణీ చేసుకునే నేను ఆయన పై ఉన్న అభిమానంతో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ కృష్ణాజిల్లా హక్కులు కొనేందుకు రాగా, శరత్‌ మరార్‌గారు, శ్రీనివాస్‌గారు నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్పారు.

‘గబ్బర్‌ సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలకు కృష్ణా జిల్లాలో 3 కోట్ల 50 లక్షల షేర్‌ వచ్చింది, ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు, అందులో కొంచెం రికవరీ అమౌంట్‌ పెట్టమని చెప్పా. సినిమా బాగా వచ్చింది, హిట్‌ కొడతామనీ.. మన వద్ద రామ్‌చరణ్, సాయిధరమ్‌ తేజ్‌ చిత్రాలు కూడా ఉన్నాయని, ఏం భయం లేదనీ అన్నారు. ఆ మాటలు నమ్మి నాలుగు కోట్ల ముప్ఫైఎనిమిది లక్షలు (నాన్‌ రిటర్నింగ్‌ అమౌంట్‌) శరత్‌ మరార్‌కు ఇచ్చా. కృష్ణా జిల్లాలో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ టోటల్‌ షేర్‌ 2 కోట్ల 52 లక్షలు రాగా, కోటీ ఎనభై ఆరు లక్షల నష్టం వచ్చింది. సేమ్‌ బ్యానర్‌లో మరో చిత్రం చేసి, నష్టపోయిన బయ్యర్లకే పంపిణీ హక్కులిచ్చి న్యాయం చేస్తామని చెప్పి ‘కాటమరాయుడు’ స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ‘ఇవ్వం’ అని, వేరే వారికి పంపిణీ హక్కులు ఇస్తున్నారు.

ఈ విషయాన్ని పవన్‌గారి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయమని అడుగుదామనుకుంటే శరత్‌ మరార్, శ్రీనివాస్‌ నన్ను కలవనివ్వడం లేదు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ ‘నీ అంతు చూస్తాం’ అని బెదిరించాడు. నాకే కాదు, నైజాం డిస్ట్రిబ్యూటర్‌కు కూడా 8 కోట్ల నష్టం వచ్చింది. ఆయనకూ సినిమా ఇవ్వం అంటున్నారు. కల్యాణ్‌గారికి ఇవేవీ తెలియవు. తెలిసుంటే న్యాయం చేసేవారు. మీడియా ద్వారా ఆయన దృష్టికి వెళితే, నష్టపోయిన నాలాంటి వారికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Advertisement
Advertisement