వాస్తవ కథాంశాలను... ప్రేక్షకులు ఆదరిస్తారు | Sakshi
Sakshi News home page

వాస్తవ కథాంశాలను... ప్రేక్షకులు ఆదరిస్తారు

Published Thu, Jan 2 2014 8:58 AM

వాస్తవ కథాంశాలను... ప్రేక్షకులు ఆదరిస్తారు

‘ఎదగారికె’ సినిమా దర్శకురాలు సుమన కిత్తూరు
 
సమాజంలో మనచుట్టూ కనిపించే అంశాలను, సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తూ సినిమాలు రూపొందించానని దర్శకురాలు సుమన కిత్తూరు వెల్లడించారు. నిజ జీవితగాథలను ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని, తాను దర్శకత్వం వహించిన ‘ఎదగారికె’ సినిమా ఘన విజయమే ఇందుకు తార్కాణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆరవ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల సందర్భంగా బెంగళూరులో బుధవారం నిర్వహించిన ‘దర్శకుల ఇష్టాగోష్టి’లో ఆమె మాట్లాడారు.            
 
 
 విమర్శకుల ప్రశంసలు అందుకోవడం సంతోషానిచ్చింది
 అగ్ని పత్రిక ఎడిటర్ అగ్ని శ్రీధర్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా అండర్‌గ్రౌండ్ మాఫియా నేపథ్యంతో తాను రూపొందించిన ‘ఎదగారికె’ సినిమా కమర్షియల్‌గానే కాక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఈ సినిమా బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలతో పాటు నాగపూర్ చలనచిత్రోత్సవాలు, ముంబై ఉమెన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్‌కు కూడా ఎంపికైందని తెలిపారు. ఈ సినిమా రూపొందించడం కోసం తాను ఎంతో కష్టపడ్డానన్న సుమన ఆ క్రమంలో ఎదురైన ఘటనలను వివరించారు.
 
 రానున్న రోజుల్లో కూడా ‘రియల్ లైఫ్ స్టోరీలే’
 ‘ఒక మనిషికి తాను చనిపోతానని తెలిసినపుడు అతని మనసులో ఎలాంటి భావాలుంటాయి, అతను చావును ఎలా స్వీకరిస్తాడు అన్న విషయాలను తెలుసుకోవడానికి నేను ఒక క్యాన్సర్ రోగితో పాటు గడిపాను. ఆమె చనిపోతుందన్న సాయంత్రం మొత్తం అక్కడే ఉండి ఆమె భావాలు, ఆమె కుటుంబ సభ్యుల వేదన ఎలా ఉన్నాయో తెలుసుకోగలిగాను’ అంటూ చిత్ర నిర్మాణానికి సంబంధించిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
 
 రానున్న రోజుల్లో కూడా సమాజంలో జరుగుతున్న దురాగతాలు, నిజ జీవిత సంఘటనల ఇతివృత్తంతోనే సినిమాలు రూపొందిస్తానని చెప్పారు. ముఖ్యంగా మహిళలపై పెచ్చుమీరుతున్న అఘాయిత్యాలపై తన తర్వాతి సినిమా ఉండవచ్చని చెప్పారు. గతంతో పోల్చుకుంటే శాండల్‌వుడ్‌లో ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వాడకం బాగా పెరిగిందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని సుమన కిత్తూరు అభిప్రాయపడ్డారు.
 
 నేడు చలనచిత్రోత్సవాల ముగింపు ఉత్సవాలు....
 బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల ముగింపు ఉత్సవాలు గురువారం జరగనున్నాయి. నగరంలోని ఫన్ సినిమాస్‌లో గురువారం సాయంత్రం 5.30గంటలకు నిర్వహించే ముగింపు ఉత్సవాలకు గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చలనచిత్రోత్సవాల్లో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో బహుమతులు గెలుచుకున్న సినిమాలకు అవార్డులను అందించనున్నారు. కార్యక్రమానికి మంత్రి రామలింగారెడ్డితో పాటు శ్రీలంకకు చెందిన నటి మాలినీ ఘోన్‌సేకా, శాండల్‌వుడ్ నటుడు దర్శన్ హాజరుకానున్నారు.   
 

Advertisement
Advertisement