‘2.0’ ముందుకు వస్తుందా? | Sakshi
Sakshi News home page

‘2.0’ ముందుకు వస్తుందా?

Published Sun, Dec 31 2017 1:59 AM

Epic Film like 2.0 will not happen Again ! : Super Star Rajinikanth - Sakshi

రజనీకాంత్‌ సినిమా రిలీజ్‌ అంటే అభిమానులకు పండగ రోజు. అలాంటిది పండగ రోజు ఆయన సినిమా విడుదలైతే డబుల్‌ ఫెస్టివల్‌. వచ్చే సంవత్సరాది (ఏప్రిల్‌ 14) రజనీకాంత్‌ అభిమానులకు టూ ఫెస్టివల్స్‌. ఒకటి తమిళ న్యూ ఇయర్‌. ఇంకోటి ‘2.0’ రిలీజ్‌. అదేంటీ.. ఏప్రిల్‌ 27న కదా ‘2.0’ రిలీజ్‌ అనుకుంటున్నారా? లేదట. ‘ఏప్రిల్‌ 14న రిలీజ్‌ అనుకుంటున్నాం’ అని శనివారం ‘ఫ్యాన్స్‌ మీట్‌’లో రజనీకాంత్‌ పేర్కొన్నట్లుగా వార్త షికారు చేసింది. ‘‘2.0 చాలా గ్రాఫిక్స్‌తో కూడుకున్న సినిమా. అందుకే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

అందుకే జనవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా పడింది. ఎన్నిసార్లు వాయిదా పడినా సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బడ్జెట్‌ విషయంలోనే కాదు కంటెంట్‌ పరంగా కూడా చాలా గొప్ప సినిమా ఇది. తమిళంలో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాలాగా చాలా కాలం గుర్తుపెట్టుకునే సినిమాగా నిలిచిపోతోంది. దర్శకుడు శంకర్‌ చాలా యునిక్‌ పాయింట్‌ను ఈ సినిమాలో చెప్పబోతున్నాడు.  ‘కాలా’ సినిమాలో కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తాను. ఒక కొత్త రజనీకాంత్‌ను దర్శకుడు పా.రంజిత్‌ మీ అందరికి చూపించబోతున్నాడు’’ అని రజనీకాంత్‌ ‘2.0, కాలా’ గురించి ఫ్యాన్స్‌తో పలు విశేషాలు పంచుకున్నారు.


ఇంత చెప్పారు కదా సార్‌.. మరి రాజకీయల గురించి ? అని అడిగితే
‘‘ఇంకొక్క రోజు ఆగండి’’ అన్నారు. ఆ ఇంకొక్క రోజు ఈరోజే (ఆదివారం). సో.. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? రారా? సాయంత్రానికల్లా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటివరకూ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వని రజనీ ఈసారి మాత్రం స్పష్టంగా తన నిర్ణయాన్ని చెప్పేయాలనుకుంటున్నారట. ఫ్యాన్స్‌ మీట్‌లో రజనీ తన ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకున్నారు. ఈ స్థాయికి రావడానికి కారణమైన దర్శకుడు కె.బాలచందర్‌ గురించి మాట్లాడారు. ‘‘బాలచందర్‌గారిని నేను మొట్టమొదటిసారి కలసినప్పుడు తమిళ్‌ నేర్చుకోమన్నారు.

మూడు సినిమాలకు నన్ను బుక్‌ చేసుకున్నారు. బాలచందర్‌గారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుని, నేను స్టార్‌ అయ్యాక దర్శకుడు ఎస్‌. పి. ముత్తురామన్‌గారు, మణిరత్నంగారు, సురేష్‌కృష్ణగారు.. నన్ను సూపర్‌ స్టార్‌ని చేశారు. ‘రోబో’ సినిమాతో శంకర్‌ నన్ను జాతీయ స్థాయి నటుణ్ణి చేశారు’’ అని రజనీ అన్నారు. వాస్తవానికి ‘రోబో’కన్నా ముందే రజనీ జాతీయ స్థాయి నటుడే. అయితే శంకర్‌ పేరుని సూచించడం ఆయన సింప్లిసిటీని తెలియజేస్తోంది. ఇదిలా ఉంటే... ఒకవేళ ‘2.0’ నిజంగానే ఏప్రిల్‌ 14న విడుదలైతే ఇక్కడ మన రెండు తెలుగు సినిమాల రిలీజ్‌ డేట్‌ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు (‘భరత్‌ అనే నేను) హీరోగా రూపొందుతోన్న సినిమా. ఇంకొకటి వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతోన్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వాస్తవానికి ముందు రిలీజ్‌ డేట్‌ (ఏప్రిల్‌ 27) ప్రకటించింది ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రబృందమే. ఆ తర్వాత అదే తేదీని మహేశ్‌బాబు మూవీ యూనిట్‌ ప్రకటించింది. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం శ్రేయస్కరం కాదు కాబట్టి, రెండు చిత్రాల నిర్మాతలిద్దరూ కలసి సామరస్యంగా మాట్లాడుకుని, ఓ నిర్ణయానికి రావాలనుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement