వెండితెరపై అరుణిమా జీవితం | Sakshi
Sakshi News home page

వెండితెరపై అరుణిమా జీవితం

Published Sun, May 24 2015 8:32 AM

వెండితెరపై అరుణిమా జీవితం

అరుణిమా సిన్హా పేరు గుర్తుందా? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగ మహిళ ఆమే! ఈ మాజీ క్రీడాకారిణి  గురించి, ఆమె జీవితంలో ఎదురైన విషాదం గురించి, పట్టుదలతో అన్నిటినీ ఎదిరించి శిఖరాగ్రానికి చేరిన ఆమె దీక్ష గురించి పత్రికల్లో చాలా కథనాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె జీవితాన్ని వెండితెరకు ఎక్కించే ప్రయత్నం మొదలైంది.

దర్శక - నటుడు ఫర్హాన్ అఖ్తర్ ఆ పని చేయడానికి ముందుకొచ్చారు. పరుగుల వీరుడు మిల్కాసింగ్ జీవితం ఆధారంగా ‘భాగ్ మిల్కా భాగ్’ లాంటి నిజజీవిత కథా చిత్రానికి తెరపై ప్రాణం పోసిన ఆయన ఇప్పుడు అరుణిమా సిన్హా జీవితంపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయన ఈ వారం లక్నో వెళ్లి, అరుణిమను స్వయంగా కలసి, ఈ బయోపిక్ ప్రతిపాదన చేశారు. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అయిన అరుణిమ 2011లో రైలు ప్రయాణంలో దోపిడీ దొంగల్ని ప్రతిఘటించారు. ఆ ఘర్షణలో దొంగలు ఆమెను రైలులో నుంచి కిందకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఆమె కాళ్లలో ఒకటి తొలగించాల్సి వచ్చింది. అయినా పట్టువదలకుండా ఆమె చేసిన ఎవరెస్ట్ శిఖరారోహణ గురించి ఫర్హాన్ చదివారు.

‘బోర్న్ ఎగైన్ ఆన్ ద మౌంటెన్’ అంటూ అరుణిమపై వచ్చిన పుస్తకం చదివిన ఫర్హాన్ అఖ్తర్ నేరుగా ట్విట్టర్‌లో నెల రోజుల క్రితం ఆమెను సంప్రదించారు. అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న అరుణిమ ఇటీవల తిరిగి రాగానే, ఈ వారం ఆమెను ఫర్హాన్ స్వయంగా కలిశారు. అరుణిమ లాంటి వ్యక్తుల జీవితంపై సినిమా తీస్తే అది మరింత మందికి స్ఫూర్తినిస్తుందని ఫర్హాన్ అభిప్రాయం.

కాగా, ఈ సినిమాకు తనకు వచ్చే రాయల్టీతో నిరుపేదలు, వికలాంగులకూ ఒక ఉచిత స్పోర్ట్స్ అకాడమీ స్థాపించాలని అరుణిమ భావిస్తున్నారు. లక్నోకు దగ్గరలో ‘పండిట్ చంద్రశేఖర్ వికలాంగ్ ఖేల్ అకాడమీ’ పేరిట సంస్థను నెలకొల్పాలనుకుంటున్న ఆమె ఇప్పటికే తనకు వస్తున్న ఆర్థిక సహాయం మొత్తాన్నీ అటు మళ్లిస్తున్నారు. ఫర్హాన్ వెండితెర ద్వారా, అరుణిమ నిజజీవిత ఆచరణ ద్వారా - మార్గాలు వేరైనా, స్ఫూర్తిదాయక ప్రయత్నాలే చేస్తున్నారు కదూ!

Advertisement

తప్పక చదవండి

Advertisement