నాకు మొహమాటం ఎక్కువ.. అందుకే! | Sakshi
Sakshi News home page

నాకు మొహమాటం ఎక్కువ.. అందుకే!

Published Wed, Jul 19 2017 11:09 PM

నాకు మొహమాటం ఎక్కువ.. అందుకే!

‘‘శేఖర్‌గారి సినిమాల్లో బలమైన, భారీ కథలేవీ ఉండవు. కానీ, హ్యూమన్‌ ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపిస్తారు. మన ఇంట్లోనో, పక్కింట్లోనో జరిగినట్టుండే సీన్లతో కథ అల్లుతారు. ‘ఫిదా’ కూడాఅలానే ఉంటుంది. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఫిదా  అవుతారు’’ అన్నారు వరుణ్‌ తేజ్‌. ఆయన హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ‘ఫిదా’ రేపు రిలీజవుతోంది. వరుణ్‌ చెప్పిన విశేషాలు...

‘ఫిదా’లో ప్రేమకథతో పాటు తండ్రీకూతుళ్లు, అన్నదమ్ముల మధ్య అనుబంధాలను శేఖర్‌గారు అందంగా, సున్నితంగా చూపించారు. నేను మెడిసిన్‌ చదివే ఎన్నారైగా నటించా. బాబాయ్‌ (పవన్‌కల్యాణ్‌) ఫ్యాన్‌గా సాయి పల్లవి నటించింది. కొన్ని సీన్స్‌లో ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేసేలా బాబాయ్‌ డైలాగులు చెప్తూ, మేనరిజమ్‌ను కాపీ చేసింది. ఆడియోలో బాబాయ్‌ పేరు ఎవరు ఎత్తినా అరుపులే. అప్పుడామె ‘ఆపడం లేదేంటి?’ అనడిగింది. ‘అదంతే! బాబాయ్‌ ఫాలోయింగ్‌ నీకు తెలీదు. మాకిది అలవాటే. ఇంకొంచెం సేపు అరుస్తారు. వెయిట్‌ చెయ్‌’ అన్నా.

ముందునుంచీ నేను హీరోయిజమ్‌ వెనుక వెళ్లడం లేదు. ‘కంచె’లోనూ పర్టిక్యులర్‌గా హీరోయిజమ్‌ అంటూ ఎక్కడా ఉండదు. ఈ సిన్మాలో కథ ప్రకారం శేఖర్‌గారు ముందు రెండు ఫైట్స్‌ అనుకున్నారు. మళ్లీ ఎక్కువ అవుతుందేమోనని ఓ ఫైట్‌ తీసేశారు. నేనేం అనలేదు. కథ బాగుంటే హ్యాపీ. మెగా ఫ్యాన్స్‌ హీరోయిజమ్‌ ఆశిస్తారు కదా? అని వరుణ్‌ను అడగ్గా.. ‘‘వాళ్లూ సినిమా బాగుంటే హ్యాపీ. ఇవన్నీ చూడరు. నాకు ఫ్యాన్స్‌ గురించి కొంచెం తెలుసు. ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌ నుంచి సిన్మా  ఏంటనేది క్లియర్‌గా చెబుతున్నాం. ప్రిపేర్‌ అవుతారు’’ అన్నారు.

నా సిన్మాల్లో ‘కంచె’ మిగతావాటి కంటే బాగా ఆడింది. అది విమర్శకుల ప్రశంసలందుకున్న సినిమాగా అన్పించింది. నిజాయితీగా చెప్పాలంటే... అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా కాదు. ఓ వర్గాన్ని బాగా ఆకట్టుకుంది. అందరికీ సినిమా నచ్చితే పెద్ద సక్సెస్‌ వస్తుంది. ఈ సిన్మా అందరికీ నచ్చుతుందనే ఉద్దేశంతో రాజుగారు ఆడియోలో ‘ఫిదా’తో వరుణ్‌కి కమర్షియల్‌ సక్సెస్‌ వస్తుందన్నారు.

శేఖర్‌గారికి ఓ సొంత మార్క్‌ ఉంది. ఆయన సిన్మాలను ఇష్టపడే వాళ్లు చాలామంది ఉన్నారు. టీజర్, ట్రైలర్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చూసి ‘ఎక్కడో దాక్కున్న మీ ఫ్యాన్స్‌ సడన్‌గా బయటకొచ్చారు’ అన్నా. ‘నాకింత మంది ఉన్నారనుకోలేదు’ అన్నారాయన.

నాన్న (నాగబాబు) సినిమా చూశారు. ఆయనకు ప్రేమకథలు పెద్దగా ఎక్కవు. కమర్షియల్, యాక్షన్‌ మీటర్‌లో వెళతారు. కానీ, ‘ఫిదా’ బాగా నచ్చింది.

చరణ్‌ అన్న, బన్నీ అన్న, తేజ్‌... ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. వాళ్లు ఎలాంటి సినిమాలు చేస్తున్నారని ఆలోచించను. నటుడిగా నా సెన్సిబిలిటీస్‌ డిఫరెంట్‌. నాకు వ్యక్తిగతంగా యాక్షన్‌ సినిమాలు చాలా ఇష్టం. ఇప్పటివరకు అలాంటి సినిమా చేయలేదు. భవిష్యత్తులో మంచి యాక్షన్‌ సబ్జెక్ట్‌ వస్తే, అన్నీ కుదిరితే సినిమా చేస్తా. ప్రయోగాలు చేయాలని ఇవన్నీ చేయడం లేదు. మంచి కథలు చేస్తున్నానుకుంటున్నా!

మిస్టర్‌’తో నేను నిరాశ పడ్డా. పెదనాన్నగారి అభిమానులంతా కూడా బాధపడ్డారు. ‘ఎలా ఒప్పుకున్నారీ సినిమా?’ అన్నారు. ‘మిస్టర్‌’కి తప్పటడుగులు పడ్డాయి. కారణాలు ఏంటని టీమంతా ఎనలైజ్‌ చేసుకున్నాం. అయితే... మరీ అంత బ్లండర్‌ అవుతుందనుకోలేదు.

మళ్లీ నిర్మాతగా నాన్న బిజీ అయితే చూడాలనే కోరిక లేదు. కానీ, ఆయనకు ఏది సంతోషాన్నిస్తే... దానికి నేను సపోర్ట్‌ చేస్తా. మరి, కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీలో సినిమా ఎప్పుడు? అంటే.. ‘‘చేస్తా. నాకు మొహమాటం ఎక్కువ. ఎవర్నీ అడగలేను. చరణ్‌ అన్నే ‘కొణిదెలలో ఎప్పుడు చేస్తావ్‌?’ అనడిగాడు. మంచి కథ కోసం చూస్తున్నాం’’ అన్నారు.

డ్రగ్స్‌ ఇష్యూలో కొందరు చిత్రపరిశ్రమను నిందించడం నేనూ టీవీల్లో చూశా. ఇటువైపు (చిత్రపరిశ్రమ) వాదనలు కూడా నేను చూశా. రెండిటిలోనూ కొన్ని కొన్ని పాయింట్స్‌ కరెక్ట్‌ అన్పించాయి. వేరే వార్తలో తొమ్మిదో తరగతి అమ్మాయి (పూర్ణిమ సాయి) మిస్‌ అయ్యిందని చూశా. దట్‌ వాజ్‌ వెరీ హర్ట్‌ బ్రేకింగ్‌. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయి. చిత్రపరిశ్రమ ఒక్కటే కాదు... ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇలాంటివి జరక్కుండా చూడాలి. ఇండస్ట్రీ విషయానికి వస్తే... విచారణ కోసం కొందర్ని పిలిచారు. ఏం జరుగుతుందో వెయిట్‌ అండ్‌ సీ!! సినిమావాళ్లను అందరూ చూస్తారు కాబట్టి మేం జాగ్రత్తగా ఉండాలి. ఓ బ్యాడ్‌ ఎగ్జాంపుల్‌గా ఉండకూడదు. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్‌ అందరూ మంచి పనులు చేస్తున్నారు. ప్రతి ఇండస్ట్రీలోనూ మంచి–చెడు, నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎక్కువ హైలైట్‌ అవుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement