శ్మశానంలో కూర్చుని ఆ కథ రాశా...

26 Aug, 2014 23:50 IST|Sakshi
శ్మశానంలో కూర్చుని ఆ కథ రాశా...

దర్శకుడు కావాలని పదిహేనేళ్లు తపస్సు చేశాడు రాజ్‌కిరణ్. అసిస్టెంట్ మేనేజర్‌గా, సహాయ దర్శకునిగా, అసోసియేట్ డెరైక్టర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎట్టకేలకు ‘గీతాంజలి’తో దర్శకుడయ్యారు. ఆయనతో జరిపిన మాటామంతీ.

కైకలూరులో ఫొటోస్టూడియో నడిపా: మాది కృష్ణాజిల్లా కైకలూరు. నేను ఫొటోగ్రాఫర్‌ని. ఫోటో స్టూడియో కూడా రన్ చేశాను. సినిమాలంటే చిన్నప్పట్నుంచీ పిచ్చి. నూతనప్రసాద్ మా ఊరు నుంచే వెళ్లి పెద్ద స్టార్ అయ్యారు. ఆయనలా నేనూ స్టార్ అవ్వాలని కలలు కనేవాణ్ణి. నిర్మాత మాగంటి బాబుగారి ద్వారా హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. అప్పటికే నాకు పెళ్లయ్యింది. పిల్లలు కూడా. జీవనోపాధినిచ్చే స్టూడియోకి తాళం వేసి హైదరాబాద్‌లో అవకాశాల కోసం వేట మొదలుపెట్టా.
 
 సినీ ప్రయాణం అలా మొదలైంది: రవిరాజా పినిశెట్టిగారి ‘అల్లుడుగారొచ్చారు’ చిత్రానికి అసిస్టెంట్ మేనేజర్‌గా చేరాను. సీన్ పేపర్లు జిరాక్స్ తీసుకురమ్మని పంపిస్తే... రెండు సెట్లు తీయించి, ఒక సెట్ నా దగ్గర ఉంచుకునేవాణ్ణి. వన్ లైన్ ఆర్డర్ అంటే ఏమిటి? సన్నివేశాలు ఎలా రాయాలి? అనేది వాటిని చూసి నేర్చుకునేవాణ్ణి. తర్వాత ‘చూసొద్దాం రండి’, ‘9 నెలలు’ చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాను. ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ చిత్రంతో అసోసియేట్ డెరైక్టర్‌గా ప్రమోటయ్యా. ఆ తర్వాత కథలు తయారు చేసుకుని, దర్శకత్వం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా.
 
 సునీల్‌తో చేద్దామన్నారు: ఓ శ్మశానంలో కూర్చొని ‘గీతాంజలి’ కథ రాసుకున్నా. ఈ కథకు నేను పెట్టిన పేరు ‘టూ లెట్’. తర్వాత అది ‘బాలాత్రిపుర సుందరి’గా మారింది. ఈ కథ విని నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓకే చేశారు. అయితే... సునీల్‌తో చేద్దామన్నారు. అప్పటికే శ్రీనివాసరెడ్డికి మాటిచ్చి ఉన్నాను. అందుకే ఒప్పులేకపోయాను. తర్వాత ఎన్నో చేతులు మారి చివరకు కోన వెంకట్‌గారి వద్దకు చేరిందీ కథ. ఆయన నిర్మాత ఎంవీవీ సత్యనారాయణగార్ని రంగంలోకి దించడంతో ఇక కథ ఎక్కడా ఆగలేదు. కోన వెంకట్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అవ్వడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. బ్రహ్మానందంగారి సైతాన్‌రాజ్ పాత్ర, షకలక శంకర్ పాత్ర ఆయన క్రియేషనే. త్వరలో ఓ యువ హీరోతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతు న్నాను.