మంచి అవకాశం మిస్ చేసుకున్నా: ‘దిల్’ రాజు | Sakshi
Sakshi News home page

మంచి అవకాశం మిస్ చేసుకున్నా: ‘దిల్’ రాజు

Published Mon, Apr 20 2015 11:37 PM

మంచి అవకాశం మిస్ చేసుకున్నా: ‘దిల్’ రాజు

 ‘‘అప్పట్లో ‘గమ్యం’ చిత్రాన్ని విడుదల చేయమని క్రిష్ నన్నడిగితే, నేను పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఆ చిత్రం చూశాక ఇంత మంచి చిత్రాన్ని విడుదల చేసే అవకాశం మిస్ చేసుకున్నామే అని బాధపడ్డా. ఇప్పుడు క్రిష్, రామోజీరావు కలిసి నిర్మించిన ‘దాగుడుమూత దండాకోర్’ సినిమా బాగా నచ్చి, నేనే విడుదల చేస్తున్నాను’’ అని ‘దిల్’ రాజు అన్నారు. తమిళ నాట ఘన విజయం సాధించిన ‘శైవం’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం- ‘దాగుడుమూత దండాకోర్’.
 
  ఆర్.కె. మలినేని దర్శకుడు. క్రిష్ సమర్పణలో ఉషాకిరణ్ ఫిలిమ్స్ పతాకంపై రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేంద్రప్రసాద్, బేబీ సారా అర్జున్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల కానుంది. క్రిష్ మాట్లాడుతూ,‘‘స్వచ్చమైన పల్లెటూరి అనుబంధాలు, ఆత్మీయతలను గుర్తు చేసే ఈ చిత్రం అందరి హృదయాలనూ కదిలించేలా ఉంటుంది. తాత, మనవరాలు, యువజంట మధ్య జరిగే కథాంశమే ఈ సినిమా’’ అని తెలిపారు. మంచి చిత్రాన్ని చూశామన్న భావన కలిగిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి.

Advertisement
Advertisement