దయామయి హన్సిక | Sakshi
Sakshi News home page

దయామయి హన్సిక

Published Thu, Jul 14 2016 2:02 AM

దయామయి హన్సిక

మానవత్వం అన్నది మాటల్లో చెబితే చాలదు. నిజమైన ప్రేమ,కరుణ, జాలి చూపేవారు ప్రచారం కోసం చెప్పుకోరు. ఇక సినీ తారల విషయానికి వస్తే సాయం చేస్తే దానికి పదింతలు ప్రచారం ఆశిస్తారు. ఈ విషయంలో నటి హన్సికను మినహాయించవచ్చు. నిరుపేదలను, అనాథలను చూస్తే ఇట్టే చలించిపోయే గుణం హన్సికది. తన ఒక్కో పుట్టినరోజుకు ఒక్క అనాథ చొప్పున ఇప్పటికి 30 మందిని దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను తీసుకుంటున్నారు.
 
 ఆ పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని కట్టించి విద్య, ఆహారం వంటి సకల సౌకర్యాలను అందిస్తున్నారు. తన సేవా కార్యక్రమాలను చెన్నైలో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నారు. అందుకు ఒక ఆశ్రమాన్ని కట్టించాలనే ఆలోచనలో ఉన్నారు. హన్సిక ప్రస్తుతం జయంరవికి జంటగా బోగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటుంటోంది.
 
 ఇటీవల ఒక రోజు షూటింగ్ పూర్తి చేసుకుని హోటల్‌కు వెళుతుండగా కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేక అవస్థలు పడుతూ ఫుట్‌పాత్‌పై పడుకున్న వారి దుస్థితి హన్సిక కంట పడింది. వారి దీన పరిస్థితికి చలించిపోయిన హన్సిక వారికి ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే మరుసటి రోజు షూటింగ్ పూర్తి చేసుకుని తన సహచరులతో కలిసి నేరుగా బట్టల షాపునకు వెళ్లి బట్టలు, దుప్పట్లు, మరో షాపులో వాటర్ బాటిళ్లు కొని అర్ధరాత్రి ఫుట్‌పాత్‌పై గాడ నిద్రలో ఉన్న ఆ దీన జీవుల ఒక్కొక్కరి పక్కన ఈ సామగ్రిని పెట్టి వెళ్లారు.
 
  హన్సిక వచ్చినట్లు, తమకు సాయం చేసినట్లు ఆ సమయంలో ఆ ఫుట్‌పాత్ సంచారులకు తెలియదు. అయితే ఆ సంఘటనకు చెందిన దృశ్యాల మీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.చేసిన దానం దాచినా దాగదంటే ఇదే మరి. ఏమైనా నటి హన్సిక సేవాగుణాన్ని అభినందించక తప్పదు. ఇలాంటి సేవలే నిజమైన మానవత్వానికి నిదర్శనంకాదంటారా.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement