ఇదే కొనసాగితే ఉద్యమాలే! | Sakshi
Sakshi News home page

ఇదే కొనసాగితే ఉద్యమాలే!

Published Thu, Dec 18 2014 11:15 PM

Hansika's Chandrakala to release on Dec 19

 ‘‘చాలాకాలం తర్వాత పూర్తి ప్రాఫిట్‌తో నేను రిలీజ్ చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా యాభై శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది శుభసూచకం’’ అని సి.కల్యాణ్ అన్నారు. హన్సిక ప్రధాన పాత్రధారిణిగా సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘అరణ్మణై’. ఈ చిత్రాన్ని ‘చంద్రకళ’గా సి. కల్యాణ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. శ్వేతలాన, వరుణ్, తేజ, సి.వి.రావు నిర్మాతలు. నేడు విడుదల కానున్న ఈ సినిమా గురించి సి.కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఇందులో హీరోయిన్ అమ్మవారి భక్తురాలు. ఆ అమ్మాయి ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమ పండే సమయంలో దారుణంగా హత్యకు గురై.. ప్రేతాత్మగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ. ‘అరుంధతి’ని గుర్తు చేస్తుందీ సినిమా’’ అని చెప్పారు.
 
 ఇది ఇలా ఉండగా, ఈ సినిమా విడుదల విషయంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ -‘‘లీజు విధానానికి నేను వ్యతిరేకం కాదు. ‘ఆ నలుగురు’, ‘ఆ ముగ్గురు’ అని మాట్లాడటం కూడా సబబు కాదని పలు సందర్భాల్లో చెప్పాను. కానీ... ఇంత పలుకుబడి ఉండి, ఇంత సర్కిల్ ఉన్న నాకే ఈ సినిమా విడుదల చేయడం కష్టమైందంటే.. ఇక చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి? లీజు విధానాన్ని చూపిస్తూ మధ్య స్థాయి నిర్మాతల్ని, పంపిణీదారుల్ని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదు. ఈ పరిస్థితులే కొనసాగితే ఉద్య మాలు జరుగుతాయి. అది ఎవరికీ మంచిది కాదు. నేను ఛాలెంజ్‌గా తీసుకొని ఫిష్ వ్యాపారి బాబూరావుతో కలిసి నైజాంలో 125 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నా. మొత్తం మీద 400 థియేటర్లలో సినిమా విడుదలవుతుంది’’ అని చెప్పారు సి.కల్యాణ్.
 
 ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జనరల్ సెక్రటరీగా ఎంపికవడం పట్ల ఆనందాన్ని వెలిబుచ్చుతూ -‘‘దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షునిగా నా సేవలను గుర్తించడం వల్లే నాకు ఈ గౌరవం లభించింది. మన సమస్యలన్నింటినీ పొందుపరచి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి మెమొరాండం ఇవ్వనున్నాం’’ అని తెలిపారు. నాగచైతన్య హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తాను ప్రారంభించిన ‘దుర్గా’ చిత్రం ఆగిపోలేదనీ, త్వరలోనే ఆ చిత్రం షూటింగ్ మొదలవుతుందనీ, అయితే... దర్శకుడు మారతాడనీ, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా నిర్మిస్తాననీ సి.కల్యాణ్ చెప్పారు. వరుణ్‌తేజ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
 

Advertisement
Advertisement