హాలీవుడ్‌ కంపోజర్‌ మోరికోన్‌ మృతి 

8 Jul, 2020 00:07 IST|Sakshi

ఆస్కార్‌ అవార్డ్‌గ్రహీత ప్రముఖ హాలీవుడ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఎన్నియో మోరికోన్‌ (91) కన్నుమూశారు. 1928 నవంబర్‌ 10న రోమ్‌లో జన్మించారు మోరికోన్‌ వెస్ట్రన్‌ మ్యూజిక్‌లో తనదైన ముద్ర వేశారు. దాదాపు నాలుగువందల సినిమాలకు సౌండ్‌ట్రాక్స్‌ కంపోజ్‌ చేశారు. ‘ది గుడ్‌ ది బ్యాడ్‌ ది అగ్లీ’, ‘ది మిషన్‌’, ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ది వెస్ట్‌’, ‘ది అన్‌టచబుల్స్‌’ వంటి సినిమాలకు మోరికోన్‌ అందించిన సౌండ్‌ ట్రాక్స్‌ ఆయన్ను చాలా పాపులర్‌ చేశాయి. ఐదుసార్లు (డేస్‌ ఆఫ్‌ హెవెన్, ది మిషన్, ది అన్‌టచబుల్స్, బుగ్సీ, మలేనా చిత్రాలకు) ఆస్కార్‌కు నామినేట్‌ అయిన మోరికోన్‌ ఫైనల్‌గా 2015లో వచ్చిన ‘ది హేట్‌ఫుల్‌ ఎయిట్‌’ అనే చిత్రానికి బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు సాధించారు. అలాగే సంగీతానికి అందించిన కృషికి గౌరవంగా ఆస్కార్‌ అకాడమీ ఆయనకు జీవితసాఫల్య పురస్కారాన్ని 2007లో అందించింది. మోరికోన్‌ మృతి పట్ల పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ‘మీ సంగీతంతో ఎప్పటికీ బతికే ఉంటారు. మీరు నాకు గురువులాంటివారు’ అని ఇండియన్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు