నేను స్వతంత్రురాలిని.. | Sakshi
Sakshi News home page

నేను స్వతంత్రురాలిని..

Published Sat, Feb 15 2014 11:39 PM

నేను స్వతంత్రురాలిని.. - Sakshi

నేను ఎలాంటి సినిమాలు చేయాలనే విషయమై నా తండ్రి ఏనాడూ కలుగజేసుకోలేదు.. ఆ విషయంలో నేను స్వతంత్రురాలిని.. అని ప్రముఖ నిర్మాత మహేష్ భట్ కుమార్తె, బాలీవుడ్ నటి ఆలియా భట్ తెలిపింది. ఆమె ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తనకు దర్శకుడు కరణ్ జోహార్‌తో మంచి స్నేహం ఉందని, సిని మాల గురించి అతడితో చర్చించినంత తండ్రితో కూడా చర్చించనంది. ‘కరణ్ నా శ్రేయోభిలాభి.. నాకు ఎటువంటి ఆఫర్ వచ్చినా మొదట అతడికే ఫోన్ చేసి చెబుతాను.. ఆ తర్వాతే నా తండ్రికి..’ అని ఆమె చెప్పింది. కాగా తనకు ధర్మ ప్రొడక్షన్‌తో కాంట్రాక్ట్ ఉందని, ఆ బ్యానర్ కింద మూడు సినిమాల్లో నటిం చేందుకు వచ్చే ఐదేళ్ల పాటు వారి తోనే తాను పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. ‘నా వృత్తికి సంబంధించి మా నాన్న నాతో మాట్లాడుతాడు తప్పితే నిర్ణయాల్లో కలుగజేసుకోడు.. అందుకే కరణ్ సాయం తీసుకుంటా..’ అని ముద్దుగా చెప్పింది.
 
 ‘నా తండ్రికి సినిమాలంటే ప్రాణం.. దానిపైనే దృష్టి ఎక్కువ.. నిజం చెప్పాలంటే ఆ తర్వాతే మేమంతా.. నేను చిన్నప్పుడు ఏ తరగతి చదువుతున్నానో కూడా అతడికి తెలిసేది కాదు.. అయితే సినిమాల్లో పనిచేసేందుకు నేను ఆసక్తి చూపించిన తర్వాత నా గురించి పట్టించుకోవడం మొదలుపెట్టాడు.. నాకు ఒక ట్రాక్ ఏర్పాటుచేశాడు..’ అని తన తండ్రికి వృత్తిపై ఉన్న మమకారాన్ని తెలిపింది. ‘జయాపజయాలను ఒకేలా తీసుకోవడం నేర్చుకోమని మా నాన్న నాకు ఎప్పుడూ చెబుతాడు.. విజయం వచ్చిందంటే ఫెయిల్యూర్‌ను భరించేందుకు మానసికంగా సిద్ధంగా ఉండమని నాకు నూరిపోస్తాడు..’ అని చెప్పింది. మహేష్ భట్‌కు విశేష్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. అయితే అందులో అప్పుడే తాను పనిచేయనని ఆలియా చెబుతోంది. అక్కడ తాను పనిచేయడానికి సరైన స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతే నటించడానికి ఒప్పుకుంటానని ఈ 20 ఏళ్ల చిన్నది తన గురించి చెప్పుకొచ్చింది.

 

Advertisement
Advertisement