ఇది అంచనాలు అందుకొనే సినిమా : దర్శకుడు శంకర్ | Sakshi
Sakshi News home page

ఇది అంచనాలు అందుకొనే సినిమా : దర్శకుడు శంకర్

Published Wed, Dec 31 2014 10:53 PM

ఇది అంచనాలు అందుకొనే సినిమా : దర్శకుడు శంకర్ - Sakshi

భారతీయ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలోని విజువల్ అద్భుతం ‘ఐ’ తెలుగు పాటల విడుదల కార్యక్రమం సినీ పరిశ్రమలోని ఇతర దర్శక దిగ్గజాలకు కూడా వేదిక అయింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను తదితర తెలుగు దర్శక ప్రముఖులు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణ అయింది. పాటల సీడీని రాజమౌళి ఆవిష్కరించగా, తొలి ప్రతిని త్రివిక్రమ్ అందుకున్నారు. ఈ వేడుకలో శంకర్ మాట్లాడుతూ, అందరం ఏళ్ళ తరబడి చేసిన శ్రమ ఫలితంగా రూపొందిన ‘ఐ’లోని దృశ్యాలు అంచనాలను పెంచేశాయన్నారు.
 
 అయినప్పటికీ, వాటన్నిటినీ ఈ సినిమా అందుకుంటుందని నమ్మకంగా చెప్పారు. ‘మగధీర’, ‘ఈగ’ చిత్రాలతో రాజమౌళికి అభిమానిగా మారిన తాను ‘బాహుబలి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. అలాగే, ఇన్నేళ్ళుగా అనువాద చిత్రాలతోనే తెలుగు వారిని ఆకట్టుకుంటున్న తాను త్వరలోనే నేరుగా తెలుగులోనే సినిమా చేస్తానని సభాముఖంగా మాట ఇచ్చారు. ఆస్కార్ వి. రవిచంద్రన్ నిర్మించిన ‘ఐ’ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ అధినేతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్‌లు తెలుగులో అందిస్తున్నారు. పాటల రచయిత చంద్రబోస్ ప్రసంగిస్తూ, శంకర్, విక్రమ్‌ల గురించి తనదైన శైలిలో తెలుగులో లోతైన విశ్లేషణ చేశారు.
 
 ఆ ప్రసంగం తాలూకు వివరాలను శంకర్, విక్రమ్‌లు త్రివిక్రమ్ ద్వారా అనువదింపజేసుకొని చెప్పించుకోవడం కనిపించింది. చిత్ర కథానాయకుడు విక్రమ్ మాట్లాడుతూ, మేకప్ వేసుకోవడానికి అయిదు గంటలు, తీయడానికి రెండు గంటలు పట్టిన పాత్ర కోసం, ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడి పనిచేశామన్నారు. కళాదర్శకుడు ముత్తురాజ్, ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ తదితర చిత్ర యూనిట్ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement