బాహుబలి దెబ్బకు కుంగ్‌ ఫూ మటాష్‌ | Sakshi
Sakshi News home page

బాహుబలి దెబ్బకు ‘ఆ సినిమా’ మటాష్‌

Published Sat, Apr 29 2017 4:01 PM

బాహుబలి దెబ్బకు కుంగ్‌ ఫూ మటాష్‌

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సష్టిస్తున్న బాహుబలి–2 (ది కక్లూజన్‌) సినిమా దెబ్బకు ప్రేక్షకాధారణ పొందుతున్న అస్సామీస్‌ చిత్రం సీక్వెల్‌ ‘లోకల్‌ కుంగ్‌ ఫూ–2’ తీవ్రంగా దెబ్బతిన్నది. బాహుబలి చిత్రం ప్రదర్శన కోసం బాగా నడుస్తున్న తమ చిత్రాన్ని అర్ధాంతరంగా థియేటర్ల నుంచి తొలగించి తమకు అన్యాయం చేశారని నిర్మాత కెన్నీ బాసుమత్రే వాపోతున్నారు. ఆయన లోకల్‌ కుంగ్‌ ఫూను 2015లో తీశారు. ఆ సినిమా బాగా నడవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌ తీశారు. ఈ సీక్వెల్‌ 19వ తేదీన విడుదలైంది.

అస్సామీస్‌ యుద్ధ కళలను కామెడీ పద్ధతిలో చూపించడం వల్ల తమ చిత్రం ప్రేక్షకాధరణ ఊహించినట్లే పెరిగిందని చెప్పారు. సాధారణంగా చిన్న బడ్జెట్‌లో తీసే అస్సామీస్‌ చిత్రాలు రెండో వారంలో ఊపందకుంటాయని ఆయన చెప్పారు. రెండో వారంలో దాదాపు సినిమా హాళ్లు నిండుతున్న సమయంలో తమ సినిమాను ఎత్తేసి బాహుబలి–2 హిందీ వర్షన్‌కు థియేటర్లు అవకాశం ఇవ్వడం వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. మొదటి భాగం హిట్టయిన కారణంగా కొంచెం ఎక్కువ బడ్జెట్‌తోనే సినిమాను తీశామని, మరో వారం ఆడితేగానీ తాము పెట్టిన పెట్టుబడి తిరిగి రాదని ఆయన అన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లోలాగా స్థానిక సినిమాలకు రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకరావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తప్పనిసరిగా స్థానిక సినిమాలకు కొన్ని స్క్రీన్లను కేటాయిస్తూ తమిళనాడు, మహారాష్ట్రలో ప్రత్యేక రాష్ట్ర చట్టాలున్నాయి. ఇంతకుముందు షారూక్‌ ఖాన్‌ నటించిన రాయీస్‌ చిత్రం విడుదల సందర్భంగా కూడా బాగా నడుస్తున్న ఓ అస్సామీ సినిమాను అర్ధంతరంగా ఎత్తివేశారు. దీనిపై ఆ సినిమా దర్శకుడు హిమాంషు ప్రసాద్‌ ఏకంగా మైన్మార్‌లో తలదాచుకున్న అల్ఫా నాయకుడు పరేశ్‌ బారువాకు ఓ లేఖ రాశారు. దాంతో బారువా ఓ స్థానిక టీవీ ముందుకొచ్చి అస్సామీ సినిమాల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అంతు చూస్తానని థియేటర్‌ యజమానులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు థియేటర్‌ యజమానుల సంఘంతో చర్చలు జరిపింది. ఆ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఆ సమస్య అలాగే ఉండి పోయింది.

అస్సామీ చిత్రాలు ఏడాదికి దాదాపు 40 చిత్రాలు విడుదలవుతాయని, అవన్ని చిన్న బడ్జెట్‌ చిత్రాలవడం, ప్రజలు కూడా వాటికన్నా హిందీ చిత్రాలను చూసేందుకు ఇష్ట పడడం వల్ల తమకు అసలు లాభాలు రావని, తమ థియేటర్ల నిర్వహణకు, సిబ్బంది జీతాలు చెల్లించేందుకే తాము హిందీ సినిమాలపై ఆధారపడాల్సి వస్తోందని థియేటర్‌ యజమానులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మరోసారి మీడియా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లగా త్వరలోనే ఈ చట్టం తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Advertisement
Advertisement