షారూక్‌ అంటే ఇష్టం | Sakshi
Sakshi News home page

షారూక్‌ అంటే ఇష్టం

Published Sun, Dec 25 2016 10:42 PM

షారూక్‌ అంటే ఇష్టం

లిటిల్‌స్టార్‌గా పేరు గాంచిన నటి షామిలి. బాలతారలుగా అక్కాచెల్లెళ్లు శాలిని, షామిలి తమదైన నటనతో అబ్బుర పరిచారు. అక్క శాలిని కథానాయకిగా మూడు నాలుగు చిత్రాలే చేసి నటుడు అజిత్‌కు అర్ధాంగి అయి నటనకు స్వస్తి పలికారు. ఇక బాల తారగా జాతీయ అవార్డును సైతం గెలుచుకున్న షామిలి ఇటీవల తెరపైకి వచ్చిన వీరశివాజీ చిత్రంతో కథానాయకిగా పరిచయమయ్యారు. అయితే అంతకు ముందే టాలీవుడ్‌లో ఓయ్‌ అనే చిత్రంలో సిద్ధార్‌థకు జంటగా నటించారన్నది గమనార్హం. ఏ విషయాన్నైనా గలగలా మాట్లాడే షామిలితో చిన్న భేటీ..

ప్ర: కోలీవుడ్‌లో నాయకిగా పరిచయం అవడానికి ఇంత ఆలస్యమైందే?
జ: విజువల్‌ కమ్యూనికేషన్ చదివిన నేను అందులో పై చదువుకోసం సింగపూర్‌ వెళ్లాను. అక్కడ మూడేళ్ల నటన, సినిమాకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకున్నాను. ఆ సమయంలో నాలో చిన్న సందిగ్ధం నెలకొంది. సింగపూర్‌లోనే సెటిల్‌ అవుదామా? లేక భారతదేశానికి తిరిగి వెళ్లిపోదామా? అన్న చిన్న సంశయం కలగగా చివరికి నటనకే మొగ్గు చూపి చెన్నైకి తిరిగి వచ్చాను. అప్పుడే వీరశివాజీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

ప్ర: వీరశివాజీ చిత్రంలో నటించిన అనుభవం?
జ: చాలా తీయని అనుభవం. ఈ చిత్రంలో నటించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కలగలేదు. కారణం ఈ చిత్ర కథానాయకుడు విక్రమ్‌ ప్రభు చెల్లెలు నేనూ బా      ల్య స్నేహితురాళ్లం. అందువల్ల విక్రమ్‌ప్రభు,ఆయన కుటుంబంతో మంచి పరిచయం ఉంది. దీంతో విక్రమ్‌ప్రభుకు జంటగా నటించడానికి శ్రమ పడాల్సిన అవసరం ఏర్పడలేదు.

ప్ర: బేబీ షామిలిగా నటించడానికి, కథానాయకి  షామిలికీ వ్యత్యాసం ఏమైనా ఉందా?
జ: చాలా ఉంది.బేబీ షామిలిగా కెమెరా ముందు నిలబడి నటించడానికి ఎప్పుడూ భయపడలేదు. ఇప్పుడు కెమెరా ముందుకు వెళ్లడానికి కాస్త భయం అనిపించింది. కారణం ఇప్పుడు నాకు చెప్పడానికి నాన్న లేరు.

ప్ర: మీ అక్క శాలిని నటన గురించి మీకు ఏమైనా సలహాలు ఇస్తుంటారా?
జ: మా అక్క నాకు ఎలాంటి సలహాలు ఇవ్వరు. కాకపోతే మేకప్, హెయిర్‌స్టయిల్‌ వంటి విషయాల్లో సూచనలు ఇస్తుంటారు.

ప్ర: మీ బావ అజిత్‌ గురించి?
జ: మా బావ ఎక్కువగా మాట్లాడరు. ఇక ఇంట్లో సినిమాల గురించి చర్చిండం చాలా తక్కువే.

ప్ర: అజిత్‌ నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినవి?
జ: చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వాలి, విల్లన్, గాడ్‌ఫాదర్, బిల్లా చిత్రాలు నాకు చాలా ఇష్టం.

ప్ర: అజిత్‌తో జంటగా నటించే అవకాశం వస్తే నటిస్తారా?
జ: అజిత్‌ నాకు అన్నయ్య లాంటి వారు.ఆయనకు జంటగా ఎలా నటించగలను.అయితే ఆయన హీరోగా నటించే చిత్రంలో మంచి పాత్రలో నటించడానికి సిద్ధమే.

ప్ర: ఎలాంటి పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారు?
జ: ప్రస్తుతానికి బలమైన పాత్రల జోలికి వెళ్లకుండా నగర నేపథ్యంలో సాగే కమర్షియల్‌ పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను.

ప్ర: మీ అభిమాన కథానాయకుడెవరు?
జ: నాకు చిన్నతనం నుంచి హిందీ నటుడు షారూఖ్‌ ఖాన్ అంటే చాలా ఇష్టం.

ప్ర: భవిష్యత్‌లో షామిలిని నటిగానే చూస్తామా? లేక దర్శకురాలిగా చూసే అవకాశం ఉంటుందా?
జ: ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే. అయితే డ్యాన్స్ పై ఆసక్తి ఉంది. చిత్రలేఖనం కూడా నేర్చుకుంటున్నాను. దర్శకురాలు కాదు గానీ, ఇతరులకు ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థను నెలకొల్పాలన్న ఆలోచన ఉంది.

Advertisement
Advertisement