ఇరుముగన్ తెరకెక్కుతుందా? | Sakshi
Sakshi News home page

ఇరుముగన్ తెరకెక్కుతుందా?

Published Thu, Sep 15 2016 1:44 AM

ఇరుముగన్ తెరకెక్కుతుందా?

 మొత్తానికి ఇరుముగన్ చిత్రాన్ని సంచలన విజయంగా ప్రేక్షకులు డిసైడ్ చేశారు.దీంతో ఆ చిత్ర యూనిట్ విజయోత్సాహంలో మునిగిపోయారు. సియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇరుముగన్. తన పాత్రల కోసం తీవ్ర కసరత్తులు చేసే ఈయన ఇరుముగన్ చిత్రానికి అలాంటి శ్రమనే కోరుకున్నారు. అంతగానూ సక్సెస్ అయ్యారు. విక్రమ్ అఖిలన్, లవ్ అనే రెండు పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని శిబు ఫిలింస్ పతాకంపై శిబుతమీన్స్ నిర్మించారు. నయనతార,నిత్యామీనన్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు.
 
 అరిమానంబి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన శంకర్ శిష్యుడు ఆనంద్ శంకర్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను చేపట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించారు.ఆరా సంస్థ గత వారం తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేసిన ఇరుముగన్ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ విజయ బాటలో పయనిస్తోంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌తో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.ఈ సందర్భంగా చిత్రం దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ అరిమానంబి చిత్రం చూసి అభినందించిన విక్రమ్ మంచి కథ ఉంటే చెప్పండి కలిసి చేద్దాం అని అన్నారన్నారు.
 
 నిజానికి అప్పుడు తన వద్ద స్క్రిప్ట్ ఏదీలేదన్నారు.ఒక సింగిల్ లైన్ మాత్రమే చెప్పానన్నారు. అది చాలా బాగుంది బాగా ఇంప్లిమెంట్ చేయమని విక్రమ్ చెప్పారన్నారు. దీంతో తన బాధ్యత మరింతపెరిగిందని అన్నారు. ఒరుముగన్ చిత్రం విజయం వెనుక యూనిట్‌లోని ప్రతి వారి కృషి ఉందని అన్నారు. చిత్ర హీరో విక్రమ్ మాట్లాడుతూ నిజానికి ఇరుముగన్ చిత్రం తెరకెక్కుతుందో? లేదోనన్న ఆందోళనతో ఉన్నామన్నారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు నిర్మాత శిబుతమీన్ రంగంలోకి ప్రవేశించి రెండే రోజుల్లో సమస్యల్ని పరిష్కరించి ఇరుముగన్ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని తన తన భుజస్కందాలపై వేసుకుని ఈ విజయానికి కారణం అయ్యారన్నారు.
 
 ఇక అఖిలన్, లవ్ పాత్రల్లో ఏ పాత్ర కష్టం అనిపించిందని అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి కృషి చేశానన్నారు. ముఖ్యంగా లవ్ పాత్రను కొంచెం ఎక్కువ చేసినా, తక్కువ చేసినా ఇంత ఫలితం ఉండేది కాదన్నారు. నయనతార, నిత్యామీనన్, తంబిరామయ్య ఇలా అందరూ తమతమ పాత్రలకు న్యాయం చేశారని అందుకే ఇరుముగన్ ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణను పొందుతోందని విక్రమ్ అన్నారు. ఇరుముగన్ చిత్రం తమిళనాడులో విడుదల చేసిన ఆరా ఫిలింస్ అధినేత సురేశ్ మాట్లాడుతూ ఈ చిత్రం తొలి ఆరు రోజుల్లోనే 29.5 కోట్లు వసూల్ చేసిందని తెలిపారు.వచ్చే వారం కూడా ఒక థియేటర్ తగ్గకుండా ప్రదర్శింపడుతుందని చెప్పారు.
 

Advertisement
Advertisement