Sakshi News home page

మూవీ రివ్యూ: జేసన్ బోర్న్

Published Sat, Aug 6 2016 11:01 AM

మూవీ రివ్యూ: జేసన్ బోర్న్

టైటిల్: జేసన్ బోర్న్
జానర్: థ్రిల్లర్
నటీనటులు: మాట్ డామన్, టామీ లీ జోన్స్, అలీసియా వికాండర్, జూలియా స్టిల్లర్స్ తదితరులు.
దర్శకుడు: పాల్ గ్రీన్ గ్రాస్
ఆధారం: రాబర్ట్ లూలమ్ నవలలోని జేసన్ బోర్న్ పాత్ర
సంగీతం: జాన్ పావెల్, డేవిడ్ బుక్లే
సినిమాటోగ్రఫీ: బారీ అక్రాయిడ్
డిస్ట్రిబ్యూటర్స్: యూనివర్సల్ పిక్చర్స్
నిడివి: 2 గంటల 3 నిమిషాలు
విడుదల: ఆగస్టు 5 (ఇండియాలో)

హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒకడైన మాట్ డామన్.. గత ఏడాది సైన్స్ ఫిక్షన్ సినిమా 'ది మార్షియన్'తో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాడు. 108 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన 'ది మార్షియన్' ఏకంగా 630 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో అతని తర్వాతి సినిమా 'జేసన్ బోర్న్'పై క్రేజ్ క్రేజీగా పెరిగింది. అమెరికన్ రచయిత రాబర్ట్ లూలమ్ నలవలల్లోని సీఐఏ గూఢచారి పాత్ర 'జేసన్ బోర్న్'ను ఆధారం చేసుకుని రూపొందించిన ది బోర్న్ ఐడెంటిటీ(2002), ది బోర్న్ సుప్రిమసీ(2004), ది బోర్న్ అల్టిమేటం(2007), ది బోర్న్ లెగసీ(2012) లలో ఒక్క లెగసీ తప్ప మిగతా మూడింటిలోనూ మాట్ డామనే హీరో. ఇక దర్శకుడు పాల్ గ్రీన్ గ్రాస్.. ఇంతకు ముందు బోర్న్ సుప్రిమసీ, బోర్న్ అల్టిమేటంలను తెరకెక్కించాడు. సినిమాపై అంచనాలు పెరగడానికి వీళ్లిద్దరి కాంబినేషన్ కూడా ఓ కారణం! మరి, ఈ సిరీస్ లో దాదాపు పదేళ్ల తర్వాత 'జేసన్ బోర్న్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాట్ డామన్ ఊహించిన స్థాయిలో అలరించాడా? బోర్న్ కే సొంతమైన అదోరకం యాక్షన్ సీన్లను పండించాడా? మొత్తంగా హిట్ కొట్టాడా? ఫట్ మనిపించాడా?
కథేంటి?
బోర్న్ అల్టిమేటం సినిమాకు డైరెక్ట్ సీక్వెల్ అయిన 'జేసన్ బోర్న్'.. 'ఇప్పుడు నాకు అంతా తెలిసిపోయింది' అనే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. అంటే, తానొక మాజీ సీఐఏ రహస్య గూఢచారినని, సంస్థ ఆదేశాలను అనుసరించి ఎంతోమందిని కిరాతకంగా చపిన వ్యక్తినని హీరో అర్థం చేసుకుంటాడు. ఆ హత్యోదంతాలకు దూరంగా ఎక్కడో గ్రీస్ లో ఇల్లీగల్ ఫైటింగ్స్ చేస్తూ కాలం గడుపుతుంటాడు. అయితే జేసన్ అంతలా పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదని, సీఐఏ డైరెక్టర్ తలపెట్టిన కుట్రలో అతనెలా పావులా మారాడో ఆధారాలతో సహా జేసన్ కు వివరిస్తుంది స్నేహితురాలు నిక్కీ(జూలియా స్టిల్లర్స్). అందుకోసం ఆమె సీఐఏ సర్వర్ ను హ్యాక్ చేస్తుంది. దీంతో నిక్కీ, జేసన్ ల ఉనికి సీఐఏకి తెలిసిపోతుంది. అంతే, వీళ్లిద్దరినీ అంతం చేసేందుకు అధికారిక, రహస్య బలగాలను రంగంలోకి దింపుతాడు సీఐఏ డైరెక్టర్ రాబర్ట్ డేవి(టామీ లీ జోన్స్).  తన తండ్రి ఉగ్రవాదుల చేతుల్లో బలైపోయాడని ఇన్నాళ్లూ నమ్మిన జేసన్ బోర్న్.. కాదూ, సీఐఏనే చంపించిందన్న సంగతి తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనవుతాడు. వెంటనే తేరుకుని సీఐఏ అంతుచూసేందుకు బయలుదేరుతాడు. సీఐఏ సైబర్ ఆపరేషన్స్ హెడ్ హెయిథర్ లీ(అలీసియా వికాండర్) మొదట్లో డైరెక్టర్ కు సహకరించినా, తర్వాతతర్వాత అతను తప్పుడు మార్గంలో వెళుతున్నాడని గ్రహించి జేసన్ బోర్న్ కు సహకరిస్తూఉంటుంది.

'డీప్ డ్రీమ్' అనే సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ కొత్తగా రూపొందించిన అప్లికేషన్ల సాయంతో వ్యక్తిగత జీవితంలోకి చొరబడటమే కాకుండా, అందిరిపైనా నిఘా పెట్టే వీలుంటుంది. ఆ మేరకు సమాచారాన్ని దొంగిలించి, తమకు ఇవ్వాల్సిందిగా సీఐఏ డైరెక్టర్.. 'డీప్ డ్రీమ్' కంపెనీ సీఈవోను ఒత్తిడిచేస్తాడు. అందుకు అంగీకరించన యువ సీఈవో.. కన్వెన్షన్ ఏర్పాటుచేసి సీఐఏ డైరెక్టర్ కుట్రలను బట్టబయలు చేయాలనుకుంటాడు. కానీ ఈలోపే ఆ అతణ్ని ఫినిష్ చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. సరిగ్గా అదేసమయానికి జేస్ బోర్న్ ఎంటరై.. సీఐఏ డైరెక్టర్ కుట్రను భగ్నం చేస్తాడు. నాటకీయ ఫైట్ లో హెయిథర్ లీ.. రాబ్ట్ డేవిని చంపేసి, బోర్న్ ను తప్పిస్తుంది. తద్వారా జేసన్ బోర్న్ ని మళ్లీ సీఐఏలో చేర్చుకోవాలన్నది ఆమె పథకం. కానీ, ఆమె ప్రపోజల్ ను చాకచక్యంగా తిరస్కరించి తనదారిన తాను వెళ్లిపోతాడు జేస్ బోర్న్.


ఎలా ఉంది?
బోర్న్ 'ఐడెంటినీ' లెక్కకట్టేటప్పుడు పాత సినిమాల ప్రస్తావన తప్పదు. ఆ విధంగా సిరీస్ లో వచ్చిన మొదటి నాలుగు సినిమాలతో పోల్చుకుంటే 'జేసన్ బోర్న్'లో నాటకీయత లోపించింది. అలాగని అదిరిపోయే యాక్షన్ సీన్లు కూడా లేవు. తాను ఎవరో తెలుసుకున్నాక జేసన్ బోర్న్ ఏం చెయ్యాలి? ఎవరిమీద్ తిరగబడాలి? అనే పాయింట్ ను ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు చాలా కష్టపడ్డాడు. తండ్రి హత్యకు ప్రతీకారం అందులో భాగమే. 'జేసన్ బోర్న్' క్యారెక్టర్ ను ఇకముందు ఎన్ని మలుపులు తిప్పినా వర్క్ అవుట్ కాదని, అందుకే ఆ క్యారెక్టర్ ను చేయబోనని మాట్ డామన్ స్వయంగా(2007లో) మీడియాకు చెప్పాడు. అతని అంచనా వందశాతం సరైందేనని 'జేసన్ బోర్న్' చూస్తే అర్థం అవుతుంది. అదీగాక బెర్రీ అక్రాయిడ్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు కఠిన పరీక్ష. సీన్లో ఏం జరుగుతుందో అర్థంకాకముందే ఫ్రేమ్ లు మార్చుతూ, జూమ్ లు లాగుతూ కన్ఫ్యూజ్ చేస్తాడు. ఒకవేళ థియేటర్ లో 'జేస్ బోర్న్' చూడాలనుకుంటే గనుక 2డీయే సజెస్టబుల్. 120 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కి జులై 11న యూకేలో, జులై 29న యూఎస్ లో విడుదలైన 'జేసన్ బోర్న్' ఇప్పటివరకు కేవలం 131 మిలియన్ డాలర్ల్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.

Advertisement
Advertisement