Sakshi News home page

నా ప్లస్‌ పాయింట్స్‌ అవే!

Published Sun, Aug 6 2017 12:02 AM

నా ప్లస్‌ పాయింట్స్‌ అవే! - Sakshi

‘‘మా నాన్నగారి (బెల్లంకొండ సురేశ్‌)కి మంచి పేరుంది. నాకు కొంత పేరొచ్చింది. కానీ, నాకంటూ ఓ స్టార్‌డమ్‌ లేదు. అభిమానులు లేరు. అందువల్ల, నేను అందరికీ నచ్చేటట్టు సినిమా చేయాలి. అది నా తొలి సినిమా కావొచ్చు. నా తదుపరి సినిమా కావొచ్చు. కమర్షియల్‌ హంగులు, మంచి దర్శకుడు, నటీనటులు, స్పెషల్‌ సాంగులు ఉన్నప్పుడే ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమా చేరువవుతుంది’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఆయన హీరోగా `దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన సిన్మా ‘జయ జానకి నాయక’. ఈ నెల 11న ఈ సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ఇంటర్వ్యూ...

జానకి నాయకుడు కొత్తగా కనిపిస్తాడా? బోయపాటి హీరోలా కనిపిస్తాడా?
కొత్తగా ఉంటూ బోయపాటి హీరోలా కనిపిస్తాడు. ఫస్టాఫ్‌ ప్రేమకథ, సెకండాఫ్‌ బోయపాటిగారి స్టైల్‌ ఆఫ్‌ యాక్షన్‌తో కూడిన సినిమా. ‘భద్ర’లో చిన్న ప్రేమకథ ఉంది గానీ... బోయపాటిగారు మా సినిమాలో పక్కా ప్రేమకథను చూపించారు. అదంతా కొత్తగా ఉంటుంది. సీతాదేవిని లంక నుంచి రాముడు తీసుకొచ్చినప్పుడు ‘జయ జానకి నాయక’ అని ప్రజలు జేజేలు పలికారు. మాదీ అటువంటి కథే! జానకి కోసం రాముడులాంటి యువకుడు ఎలా యుద్ధం చేశాడనేది సినిమా.

⇒ బోయపాటి దర్శకుడని ఒప్పుకున్నారా? కథ విన్నారా?
కథ వినలేదు. మనం మంచి సినిమా తీయొచ్చు లేదా పక్కా కమర్షియల్‌ సినిమా తీయొచ్చు. కానీ, రెండిటితో సినిమా తీయడం కష్టం. బోయపాటిగారు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ సినిమా తీశారు. నా మూడో సినిమాకు ఇంత మంచి కథ వచ్చినందుకు.. ఐయామ్‌ లక్కీ. నా వయసును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సినిమా తీశారు. మంచి డైలాగులు చెప్పించారు. ఇంకొకటి... ‘నీకు నేనున్నా. మళ్లీ నీతో సినిమా చేస్తా’ అన్నారు. ఆయనకు నేనంతగా నచ్చడమనేది నాలో కాన్ఫిడెన్స్‌ పెంచింది. చెప్పాలంటే... బోయపాటిగారు మాకు ఈ సినిమా ఫ్రీగా చేసిపెట్టారు. అందరూ ఏమైనా అనుకోండి! అదంతా ట్రాష్‌ (చెత్త). నన్ను నమ్మి చేసి నా ఫ్యామిలీని సపోర్ట్‌ చేశారు.

⇒ యువ హీరోలు ప్రయోగాలు చేస్తుంటే... మీరు యాక్షన్, కమర్షియల్‌ రూటులోనే వెళ్తున్నట్టున్నారు?
వీవీ వినాయక్‌గారి దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో హీరోగా పరిచయమయ్యా. అందులో నా యాక్షన్‌కు మంచి పేరొచ్చింది. డ్యాన్స్, యాక్షన్‌... కమర్షియల్‌ అంశాల్లో చాలా ఏళ్లు శిక్షణ తీసుకున్నా. అవే నా ప్లస్సులు. వాటిని ఇంకా ప్లస్‌ చేసుకుంటూ, నా మైనస్‌లను కవర్‌ చేసుకుంటూ సినిమాలు చేయాలి. నా ప్లస్సులను వదులుకుంటే కష్టం! కథ బాగుంటే ప్రేమకథలు, ప్రయోగాలు కూడా చేస్తా. ఫ్రైడే సిన్మాతో వస్తే మండేకి మర్చిపోతున్నారు. అందుకే, మంచి సినిమాతో రావాలనుకుంటున్నా.

⇒ మొదటి రెండు సినిమాల్లో మీలో మీరు గమనించిన మైనస్‌లు ఏంటి?
సన్నగా ఉన్నా. యాక్షన్‌ సిన్మా హీరో కొడితే జనాలు నమ్మేలా ఉండాలి. సన్నగా ఉంటే బాగోదు. అందువల్లే ఈ సినిమాకు ముందు 25 కేజీల బరువు పెరిగా. తర్వాత పది కిలోలు తగ్గా. నా ఫిజిక్, డిక్షన్‌ విషయాల్లో జాగ్రత్త తీసుకున్నా. ఈ సినిమాతో నాకు ఎమోషనల్‌గానూ బాగా చేశాడనే పేరు వస్తుంది.

Advertisement
Advertisement