నటనకు బై..బై! | Sakshi
Sakshi News home page

నటనకు బై..బై!

Published Wed, Dec 5 2018 1:18 PM

Kamal Haasan Goodbye To Movies After Bharateeyudu 2 - Sakshi

విశ్వనటుడు కమలహాసన్‌ నటనకు బై..బై చెప్పేందుకు సిద్ధం అయ్యారు. రాజకీయాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించడం లక్ష్యంగా భారతీయుడు–2 తో తన సినీ నటనకు స్వస్తి పలికేందుకు నిర్ణయించారు.అయితే, రాజ్‌ కమల్‌ మూవీస్‌ ద్వారా సినీ వర్గాలకు  అందుబాటులో ఉంటారు. ఇక, లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం రేసులో ఉంటుందని ప్రకటించారు.

సాక్షి, చెన్నై :  ‘కమల హాసన్‌’ ఈ పేరు వింటే విలక్షణ నటుడు గుర్తుకు వస్తాడు. అదే నటనతో విశ్వఖ్యాతిని గడించారు. విశ్వనటుడిగా అవతరించి విభిన్న కథా చిత్రాలే కాదు, సంచలనాత్మక చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. నటుడిగా శిఖరాన్ని అధిరోహించి ముందుకు సాగుతున్న సమయంలో మక్కల్‌ నీది మయ్యం వేదికగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అభిమాన లోకాన్ని కలుపుతూ రాష్ట్రంలో సరికొత్త మార్పు నినాదంతో  ప్రజాహిత కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ప్రజలలో మమేకం అయ్యే రీతిలో బహిరంగ సభలు, రోడ్‌ షోలతో అలరిస్తున్నారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయ పయనాన్ని సాగిస్తూ వచ్చిన కమల్‌ ఇక, పూర్తిస్థాయిలో రాజకీయాలకు అంకితం అయ్యేందుకు నిర్ణయించారు. శభాష్‌ నాయుడు చిత్రం ఆగిన నేపథ్యంలో భారతీయుడు–2తో చివరిసారిగా తెరమీద అభిమానుల్ని తన నటనతో మైమరపించి పూర్తిగా రాజకీయ జీవితంలో మునిగేందుకు సిద్ధం అయ్యారు. కాగా, గతంలో ఓ కార్యక్రమం వేదికగా చివరి శ్వాస ఉన్నంతవరకు నటిస్తానని ప్రకటించిన కమల్‌ తాజాగా నటనకు బై..బై చెప్పేందుకు సిద్ధం అవుతుండడం అభిమానులకు నిరాశే. అయితే, పూర్తిగా తమ నటుడు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తనుండడం ఊరటే.

కేరళ వేదికగా వ్యాఖ్య
కేరళలో మంగళవారం జరిగిన గృహ నిర్మాణ పథకం వేడుకలో కమల్‌ ప్రత్యేక్షం అయ్యారు. తదుపరి అక్కడి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, తన రాజకీయ పయనం గురించి వివరించారు. కేరళలో ఇలాంటి కార్యక్రమాలు సాగడం ఆనందంగా ఉందని, ఇక్కడకు రావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తమిళనాట సైతం నిర్వహించాలన్నదే తన తపనగా పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా, మార్పు నినాదంతో మక్కల్‌ నీది మయ్యం ముందుకు సాగుతుందని వివరించారు. తాను పలు రాష్ట్రాల సీఎంలను కలుస్తూ వస్తున్నానని గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాల్లో సాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నానని, వారి ద్వారా తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. జనరంజకంగా ఉండే, ప్రజాహితానికి మేలు చేకూర్చే రీతిలో ఉన్న పథకాలను తమిళనాడులోకి తీసుకు రావాలన్న ఆకాంక్షతో తన పర్యటన సాగుతుందని తెలిపారు. కేరళ సీఎం పినరాయ్‌ విజయన్, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయ్‌ అక్కడి ప్రజలకు అందిస్తున్న పథకాలను ఈసందర్భంగా గుర్తుచేశారు.

రాజకీయాల్లోకి పూర్తిగా
సినిమాల్లో నటనకు దూరం కానున్నట్టు ప్రకటించారు. భారతీయుడు–2 చిత్రం చివరి చిత్రంగా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని త్వరితగతిన ముగించి, పూర్తిగా రాజకీయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. నటనకు దూరంగా ఉన్నా, రాజ్‌కమల్‌ మూవీస్‌ ద్వారా సినీ వర్గాలకు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. భారతీయుడు›–2 తదుపరి పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలు ఉంటాయని, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే దిశగా దూసుకెళ్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం పోటీలో ఉంటుందని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ బలాన్ని చాటే దిశగా ముందుకు సాగుతామన్నారు. భవిష్యత్తులో లౌకిక వాద పార్టీలతో కలిసి పయనం సాగించేందుకు సిద్ధమేనని ఓప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే, కులం, మతం  రంగుతో పాటుగా ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగే కలుషిత  పార్టీలతో కలిసే ప్రసక్తే లేదన్నారు.

Advertisement
Advertisement