షారుక్‌.. కమల్‌.. 4 నిమిషాల్లో 51మంది

2 Jan, 2020 09:24 IST|Sakshi

సాధనమ్మున పనులు సమకూరును ధరణిలోన..ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు అని కేరళకు చెందిన ఓ యువతి నిరూపిస్తోంది. మిమిక్రీ కళలో అద్భుతమైన ప్రతిభతో పలువురిని అబ్బుర పరుస్తోంది. మిమిక్రీ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతోంది. ప్రతీ సెకనుకు ఆమె గొంతు అద్భుతంగా వంపులు తిరుగుతుంది. ఆడ, మగ తేడా లేదు. సెలబ్రిటీలనుంచి ప్రముఖ రాజకీయవేత్తల దా​కా ప్రముఖుల గొంతులను అనుకరిస్తారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో 51మంది వాయిస్‌లను మిమిక్రీ చేయగల అసాధారణ నైపుణ్యం ఆమె సొంతం. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ అద్భుతం పేరే అఖిల.

న్యూస్‌ మినిట్‌ కథనం ప్రకారం తిరువనంతపురం జిల్లా నేదుమంగాడ్ కు చెందిన అఖిలా ఎ.ఎస్ ఆయుర్వేద మెడిసిన్ చివరి సంవత్సరం  చదువుతోంది. పాఠశాల స్థాయినుంచే స్వయంగా మిమిక్రీ కళపై ఆసక్తి పెంచుకున్న ఆమె ఇంటర్ స్కూల్ పోటీల్లో  తొలిసారి మిమిక్రీ కళను ప్రదర్శించింది.  మొదట జంతువులను అనుకరిస్తూ వచ్చింది. ఆ తరువాత స్కూలు వార్షికోత్సవాల్లో  టీచర్లను అనుకరించేంది. అలా జానకమ్మ పాట ‘అజకాదల్‌’ పాడానని అఖిల గుర్తు చేసుకుంటారు. అనేక టీవీ, మిమిక్రీ షోలను చూస్తూ నిరంతర సాధనతోనే పరిణతి సాధించారు. అలా మిమిక్రీ కళలో రాణిస్తున్న తొలి కేరళ యువతిగా అఖిల నిలవడం విశేషం.

 ప్రముఖ హీరోలు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, షారూక్‌ ఖాన్‌  సహా అచ్యుతానందన్, ఉమెన్ చాందీ వంటి రాజకీయ నాయకులు స్వరాలు ఆమె గొంతులో అలవోకగా పలికిస్తుంది. దీంతోపాటు మైఖేల్ జాక్సన్ పాటల్లోని బీట్‌ శబ్దాలు కూడా ప్రత్యేకంగా ఆమె గొంతునుంచి జాలువారతాయి. పూక్కలం వరవాయ్ చిత్రంలో బేబీ షాలినికి కూడా ఆమె డబ్బింగ్‌ చెప్పారట. అంతేకాదు ధూమపాన వ్యతిరేక ప్రకటనల ద్వారా థియేటర్లలో వినిపించే గోపన్‌ నాయర్‌ వాయిస్‌ను అఖిల గొంతులో విని తీరాల్సిందే. ఓ టీవీలో ప్రసారమైన రియాలిటీ షో ద్వారా తనకు మంచి గుర్తింపు లభించిందని ఇంకా చేయాల్సి చాలా వుందంటారు అఖిల  ఉత్సాహంగా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు