నన్ను ఎగతాళి చేశారు

13 Jan, 2020 10:41 IST|Sakshi

సినిమా: హిందీ భాషపై నటి కంగనారనౌత్‌ ప్రేమను ఒలకబోస్తోంది. ఆంగ్లం వద్దు హిందీనే ముద్దు అని అంటోంది. ఏదో ఇక చర్చనీయాంశ వ్యాఖ్యలతో వార్తల్లో ఉండడం ఈ అమ్మడి నైజంగా మారింది. బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా వెలిగిపోతున్న ఈ జాణ ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో నటించేసింది. తాజాగా హిందీ చిత్రం పంగాతో తెరపైకి రానుంది. కాగా త్వరలో మరోసారి తలైవి చిత్రం ద్వారా ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. అవును ప్రఖ్యాత నటీమణి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తోంది. ఇందుకోసం తగిన శిక్షణ కూడా తీసుకున్నట్లు కంగనారనౌత్‌ పేర్కొంది. కాగా ఇటీవల హిందీ భాషాదినోత్సం సందర్భంగా ఒక వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది.

అందులో హిందీ మన జాతీయ భాష అని అయితే ఈ భాషలో మాట్లాడడానికి మన దేశం చాలా సంకోచిస్తోందని పేర్కొంది. ఆంగ్ల భాషకు చెందిన ఏబీసీడీలను నమ్మకంగా చెబుతున్నారని, అదే హిందీ భాషలో మాట్లాడడానికి సంకట పడుతున్నారని అంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఆంగ్ల భాషను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారని ఆనందపడుతున్నారని, మరి కొందరు తమ ఆంగ్ల భాష బలహీనంగా ఉందని అవమానంగా భావిస్తున్నారని అంది. అయితే అలాంటి పరిస్థితే హిందీ భాషలో ఉంటే కించిత్‌ కూడా చింతించడం లేదని అంది. సినిమా వర్గం తన ఆంగ్ల భాష ఉచ్చారణను చూసి ఎగతాళి చేశారని చెప్పింది. తాను మాత్రం హిందీ భాషకే ప్రాముఖ్యతనిస్తున్నానని చెప్పింది. తద్వారా తాను ఉన్నత స్థాయికి చేరుకోగలనని, సక్సెస్‌లు అందుకోగలనని చెప్పింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తాను చెప్పేదొక్కటేనని మీ పిల్లలకు హిందీ భాషను నేర్పించండి అని చెప్పింది. దేశీయ నూనెతో చేసే పరోటా రుచి పిజ్జా, బర్గర్‌లలో ఉండదని అంది. అదేవిధంగా మా (అమ్మ)లో ఉన్న మాధుర్యం మామ్‌లో ఉండదని కంగనారనౌత్‌ పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు