నటుడు చిరంజీవి సర్జా కన్నుమూత | Sakshi
Sakshi News home page

కన్నడ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూత

Published Mon, Jun 8 2020 3:57 AM

Kannada actor Chiranjeevi Sarja passes away - Sakshi

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో కన్నుమూశారు. ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్‌ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా. ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి సర్జా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ను హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. చికిత్స పొందుతూ చిరంజీవి సర్జా మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

భార్య మేషునా రాజ్‌తో చిరంజీవి సర్జా

గత మూడు, నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని వైద్యులు తెలిపారు.  మృతదేహం నుంచి కరోనా పరీక్షల కోసం నమూనాలను సేకరించారు. 1980 అక్టోబరు 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా కెరీర్‌ తొలినాళ్లలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. ఆ తర్వాత నటుడిగా మారి 2009లో ‘వాయుపుత్ర’ అనే చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు. ‘ఆకే’, ‘సింగా’, ‘సంహారా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన చిరంజీవి సర్జా యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఆయన 19 సినిమాల్లో హీరోగా నటించారు.

గత ఏడాది చిరంజీవి సర్జా నటించిన నాలుగు సినిమాలు (సింగా, ఖాకీ, ఆద్యా, శివార్జున) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే ఆయన హీరోగా కమిటైన నాలుగు సినిమాల్లో ఒక చిత్రానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతుండగా, మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి.  2018 మే 2న నటి మేఘనా రాజ్‌ను వివాహమాడారు చిరంజీవి సర్జా. భర్త మరణంతో తీవ్రశోకంలో మునిగిపోయారు మేఘనా రాజ్‌. పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి సర్జా మృతి పట్ల సోషల్‌ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సోమవారం ఉదయం చిరంజీవి సర్జా స్వగ్రామం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా జక్కేనహళ్లిలో అంత్యక్రియలు జరుగుతాయి.

Advertisement
Advertisement