‘కత్తి’ రచయితకు న్యాయం జరిగిందా? | Sakshi
Sakshi News home page

‘కత్తి’ రచయితకు న్యాయం జరిగిందా?

Published Sun, Jun 12 2016 10:53 PM

‘కత్తి’ రచయితకు న్యాయం జరిగిందా? - Sakshi

చిరంజీవి రీ-ఎంట్రీ సినిమా కథ ఎలా ఉంటే బాగుంటుంది? అసలు ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయం మీద దాదాపు ఏడాది క్రితం జోరుగా చర్చ జరిగింది. కొంతమంది రచయితలు, దర్శకులు చెప్పిన కథలు రీ-ఎంట్రీకి సరిపోయేంత స్థాయిలో లేవని చిరంజీవి, ఆయన శ్రేయోభిలాషులు అనుకున్నారనే వార్త కూడా వినిపించింది. ఫైనల్‌గా తమిళ ‘కత్తి’ పర్ఫెక్ట్‌గా ఉంటుందని నమ్మి, ఆ చిత్రం హక్కులు దక్కించుకున్నారు. అయితే అప్పటికే ఆ చిత్రకథ వివాదంలో ఉంది.

తెలుగు రచయిత ఎన్.నరసింహారావు రాసిన కథ అది. ఆయన్నుంచి హక్కులు తీసుకోకుండానే తమిళ చిత్రాన్ని తెరకెక్కించేశారు. దాంతో నరసింహారావు రంగంలోకి దిగారు. అక్కడ వివాదానికి ఫుల్‌స్టాప్ పడక ముందే తెలుగు హక్కులు అమ్మడంతో వివాదం ఇక్కడ కూడా మొదలైంది. ఈ వివాదం గురించి అందరికీ తెలుసు. నరసింహారావు బహిరంగంగానే తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. చివరికి ఆయనకు న్యాయం జరిగిందని సమాచారం.

పలువురు సినీ పెద్దలు ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడేలా చేశారని తెలిసింది. మామూలుగా కొంతమంది రచయితలు కథ తమది కాకపోయినా తమదే అని వివాదం రేపుతుంటారు. కానీ, ‘కత్తి’ కథ నరసింహారావుదే అని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు నిర్ధారించారట. దాంతో ఆయనకు న్యాయం చేసే దిశగా అడుగులు వేశారట.

కళా హక్కుల వేదిక, రచయితల సంఘం, కార్మికుల సంఘం, దర్శకులు సంఘం ‘కత్తి’ కథ వివాదాన్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘కత్తి’ చిత్రదర్శకుడు వీవీ వినాయక్, తెలుగుకి అనుగుణంగా పలు మార్పులూ చేర్పులూ చేసిన పరుచూరి బ్రదర్స్ వంటి వారిని సంప్రతించి, నరసింహారావుకి న్యాయం చేశారని బోగట్టా.

టైటిల్ కార్డ్‌లో కథా సహకారానికి నరసింహారావు పేరు వేస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఆయనకు 40 లక్షల రూపాయలు పారితోషికం కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారట. దాంతో కథ వివాదానికి తెరపడిందని సమాచారం. ఈ నెలాఖరున లేక వచ్చే నెల ప్రథమార్ధంలో చిత్రీకరణ ఆరంభమయ్యే అవకాశం ఉందట. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మించనున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement