చెల్లెలి కోసం సాహసం | Sakshi
Sakshi News home page

చెల్లెలి కోసం సాహసం

Published Mon, Feb 13 2017 11:47 PM

చెల్లెలి కోసం సాహసం

సినిమా నిర్మాణమంటే మాటలు కాదు. డబ్బులొక్కటే ఖర్చు పెడితే చాలదు... ఆర్టిస్టుల డేట్స్‌ దగ్గర్నుంచి ప్రొడక్షన్‌ వర్క్, రిలీజ్‌ వరకూ సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయి. ఓ సినిమా నిర్మిస్తే పెద్ద సాహసం చేసినట్టే. అదే హీరోయిన్‌గా అయితే... షూటింగ్‌ పూర్తయిన తర్వాత ప్రమోషన్స్‌కి వస్తే చాలు. ఇవన్నీ కత్రినా కైఫ్‌కి తెలుసు. తెలిసీ చెల్లెలి కోసం సాహసం చేయడానికి సన్నద్ధమవుతున్నారట. కత్రినా చెల్లెలు ఇసబెల్లె కైఫ్‌కి తన అక్కలా హీరోయిన్‌ కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఆ కోరిక  కెనడియన్‌ సినిమా ‘డాక్టర్‌ కాబి’తో తీరింది. దానికి సల్మాన్‌ ఖాన్‌ సహ నిర్మాత.

ఇప్పుడు ఇసబెల్లేకి హిందీ హీరోయిన్‌ కావాలనే ఆశ పట్టుకుంది. సల్మాన్‌ఖాన్‌ ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారని వార్తలొచ్చాయి. తాజా ఖబర్‌ ఏంటంటే... చెల్లెలి కోసం కత్రినా నిర్మాణ సంస్థను స్థాపిస్తున్నారట. ప్రస్తుతం కథలు కూడా వింటున్నారట. తాజా ఇంటర్వ్యూలో చెల్లెలు గురించి కత్రినాను అడగ్గా.. ‘‘ఇప్పటివరకూ ఏదీ ఫైనలైజ్‌ కాలేదు. ఏదొక రోజు నా చెల్లెలి కోసం నేనే ఓ సినిమా నిర్మిస్తా’’ అన్నారు. అనుష్కా శర్మ, ప్రియాంక చోప్రా, దియా మీర్జా... ఇలా నిర్మాతలుగా మారిన కథానాయికల జాబితాలో కత్రినా కైఫ్‌ చేరే రోజు త్వరలోనే వస్తుందన్నమాట.

Advertisement
Advertisement